దుబ్బాక, అక్టోబర్ 25 : ఉద్యమాల గడ్డ దుబ్బాకలో ఎగిరేది గులాబీ జెండానే అని బీఆర్ఎస్ దుబ్బాక అభ్యర్థి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎందరో ఉద్యమకారులు త్యాగాలు చేశారని, పోలీసు కేసులు, జైలు జీవితాలను అనుభవించారని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్‌కు దుబ్బాక అంటే ఎనలేని మమకారం అన్నారు. బీఆర్ఎస్కు కార్యకర్తలే బలం, బలగమన్నారు. బుధవారం దుబ్బాక పట్టణంలోని రజినీకాంత్‌రెడ్డి ఫంక్షన్హాల్లో బీఆర్ఎస్ దుబ్బాక నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, బూత్ కమిటీ ఇన్చార్జిలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ శ్రేణులకు ఈ ఎన్నికల్లో అనుసరించాల్సిన విధానాలు, దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుబ్బాకపై ఉన్న మమకారంతోనే సీఎం కేసీఆర్ ఈ ప్రాంత బిడ్డనైనా తనను ఆశీర్వదించి అభ్యర్థిగా పంపించారని, ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీ అందించి సీఎంకు కానుకగా ఇద్దామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ సారును రెండుసార్లు సీఎంగా ఎన్నుకున్నామని, ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపించుకుని హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్‌ను చేసుకుందామని పిలుపునిచ్చారు. హనుమంతుడి లేని ఊరైనా ఉండోచ్చు కానీ కేసీఆర్ సంక్షేమ పథకం అందుకోని ఇల్లు లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను ప్రజలకు క్షుణ్ణంగా వివరించాలని సూచించారు. వంద మంది ఓటర్లకు ఒక ఇన్చార్జిగా ఉంటూ పార్టీ నాయకులు ప్రజలతో నిత్యం మమేకం కావాలని సూచించారు. పదవుల కోసం ఆరాటపడుతున్న బీజేపీ, కాంగ్రెస్‌కు చరమగీతం పాడాలని ఆయన కోరారు.
దుబ్బాక అభివృద్ధి పూర్తిగా నాదేనని, ఈ ఎన్నికల్లో మెజార్టీ మీదేనని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, వాటిని నమ్మొద్దన్నారు. సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాలతో సమానంగా దుబ్బాకను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. తనను రెండుసార్లు ఎంపీగా గెలిపించి పార్లమెంట్‌కు పంపించారని, ఇప్పుడు అదే అభిమానంతో భారీ మెజార్టీ అందించి అసెంబ్లీకి పంపించాలని కోరారు. ఈ ఎన్నికలు బీజేపీ ఎమ్మె ల్యే రఘునందన్ అవలంభించిన అధర్మం, అవాస్తవాలపై బీఆర్ఎస్ చేస్తున్న యుద్ధమని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ప్రకటించారు. గత ఉపఎన్నికల్లో నోటికొచ్చిన హామీలిచ్చి దుబ్బా క ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ఇచ్చిన హామీలు నెరవేర్చని అసమర్థత ఎమ్మెల్యేగా రఘునందన్ చరిత్రలో నిలిచిపోయాడని ఎద్దేవా చేశారు. ఉసరవెల్లి రాజకీయాలు చేస్తున్న రఘునందన్‌కు ఈ ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దుబ్బాక నియోజకవర్గంలో ప్రభుత్వ పథకాలపై విస్తృతంగా ప్రచారం చేయాల్సిన బాధ్యత నాయకులు, కార్యకర్తలపై ఉన్నదని ఇన్చార్జి గ్యాదరి బాలమల్లు అన్నారు. గత ఉపఎన్నికల్లో దుబ్బాకలో బీజేపీది గెలుపు కాదని, ఈ ఎన్నికల్లో పార్టీ శ్రేణులంతా ఐక్యమత్యంతో పనిచేసి, భారీమెజార్టీతో కొత్త ప్రభాకర్‌రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మూ డోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఉద్యమ గడ్డ దుబ్బాకలో మరోసారి గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు.