గుమ్మడిదల, ఫిబ్రవరి4: బొంతపల్లి అర్బన్‌పార్కును త్వరలో ప్రారంభిస్తామని సంగారెడ్డి జిల్లా అటవీశాఖ అధికారి శ్రీధర్‌రావు తెలిపారు. ‘అర్బన్‌పార్కుకు మోక్షమెప్పుడో’? అని సోమవారం నమస్తే తెలంగాణలో ప్రచురితమైన కథనానికి అటవీశాఖ అధికారులు స్పందించారు. మండలంలోని బొంతపల్లి అర్బన్‌పార్కును జిల్లా అటవీశాఖ అధికారి శ్రీధర్‌రావు మంగళవారం డీఎఫ్ఆర్వో దేవిలాల్, గుమ్మడిదల సెక్షన్ ఆఫీసర్ హుస్సేన్, బీట్రూట్ సిబ్బంది శ్రీకాంత్, రత్నం తదితరులతో కలిసి సందర్శించారు. అర్బన్‌పార్కులో 90శాతం పనులు పూర్తి కాగా, మిగిలిన 10శాతం పనులు త్వరలో పూర్తి చేసి పర్యాటకులకు, ప్రకృతి ప్రేమికులకు అందుబాటులోకి తెస్తామని డీఎఫ్‌వో తెలిపారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కృషితో మండలంలోని మంభాపూర్ అటవీలో నూతనంగా అర్బన్ పార్కును ఏర్పాటు చేస్తామని డీఎఫ్‌వో తెలిపారు. నర్సాపూర్, బొంతపల్లి అర్బన్పార్కులతో పాటు అద్భుతంగా మంభాపూర్ అటవీలో అర్బన్ పార్కును ఏర్పాటు చేసి కొండపైన వాచ్‌టవర్‌ను తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. జాతీ య రహదారి 765డీ సమీపంలో ఉండడంతో అర్బన్ పార్కును పర్యాటకులు అధికంగా సందర్శించే అవకాశం ఉంటుందనే ఆలోచనతో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అటవీ ప్రాంతాల గుండా వెళ్లే రోడ్లపై కోతులకు వాహనదారులు ఆహార పదార్థాలు వేస్తుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రయాణికులెవరూ వేయవద్దని డీఎఫ్‌వో సూచించారు.