మెదక్, జాన్ 6 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సర్కారు నీలి విప్లవంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో మత్స్యకారుల్లో ఆందోళన నెలకొంది. మెదక్ జిల్లాలోని 21 మండలాల్లో మొత్తం 1411 చెరువులు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 280 మత్స్యకార సంఘాలు ఉన్నాయి. మత్స్యకార వృత్తిపై సుమారు 17,500 మంది మత్స్యకారులు, వారి కుటుంబాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా లబ్ధి పొందుతున్నారు. గతేడాది సెప్టెంబర్లో కేసీఆర్ ప్రభుత్వం 1411 చెరువుల్లో రూ.4 కోట్ల విలువ గల 4 కోట్ల 63 లక్షల చేప పిల్లలను వదిలింది. బొచ్చ, రోహు, మ్రిగాల, బంగారు తీగ వంటి రకాల చేపపిల్లలు చెరువుల్లోకి వదిలి మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపింది. వారు ఆర్థికంగా ఎదిగేందుకు ఆసరాగా నిలిచింది. కానీ, ఈ ఏడాది కాంగ్రెస్ సర్కారు నుంచి ఇప్పటి వరకు చేప పిల్లల పంపిణీపై స్పష్టత రాలేదు. దీంతో మత్స్యకారుల్లో ఆందోళన నెలకొంది. అసలు చేప పిల్లల పంపిణీ చేస్తారా అనే సందిగ్ధం మత్స్యకారుల్లో ఉంది.
చేప పిల్లల కొనుగోలు కోసం ప్రతి ఏడాది మేలోనే ప్రభుత్వం టెండర్ల ప్రక్రియ చేపడుతుంది. జూన్లో వర్షాలు కురిసి చెరువుల్లోకి నీరు చేరితే ఆగస్టులో మత్స్యకారులకు వందశాతం సబ్సిడీపై మత్స్యశాఖ అధికారులు చేప పిల్లలను పంపిణీ చేస్తారు. ఈ ఏడాది జూన్ వచ్చినా ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి రాలేదు. జిల్లావ్యాప్తంగా చేప పిల్లల కొనుగోలుకు టెండర్లు పిలవాల్సి ఉన్నా… ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిన దాఖలాలు కనిపించడం లేదు. దీంతో మత్స్యకారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మత్స్యకారులకు వందశాతం సబ్సిడీపై చేప పిల్లలతోపాటు సమీకృత మత్స్య అభివృద్ధి పథకంలో భాగంగా ద్విచక్ర వాహనాలు, లగేజీ ఆటోలు, సంచార చేపల అమ్మకం వాహనాలు, చేపల కిట్లతో పాటు ఇతర సామగ్రిని మత్స్యకారులకు సకాలంలో అందజేశారు.
ప్రతి ఏడాది మెదక్ జిల్లాలో ఆగస్టు, సెప్టెంబర్లలో చేప పిల్లల పంపిణీ ఉంటుంది. ఈ ఏడాది వర్షాలు పుష్కలంగా కురిసి చెరువుల్లోకి నీరు సమృద్ధిగా వస్తే ఆ సమయంలో చేప పిల్లలు వదిలితే ఎదిగేందుకు అవకాశం ఉంటుంది. ఆలస్యం చేస్తే చేపపిల్లలు ఎదగడం కష్టంగా మారే అవకాశం ఉందని మత్స్యకారులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేప పిల్లల పంపిణీ ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మత్స్యకారులను ఆదుకునే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం చూడాలని కోరుతున్నారు.
ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం చేపడుతాం. రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తుంది. ఆ తర్వాత జిల్లా స్థాయిలో టెండర్ ప్రక్రియ ఉంటుంది. గతేడాది మెదక్ జిల్లా వ్యాప్తంగా 1411 చెరువుల్లో 4.63 కోట్ల చేప పిల్లలను వదిలాం. ఈ సంవత్సరం ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.