బీజేపీ పాలిత రాష్ర్టాల్లో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇటీవల మధ్యప్రదేశ్‌లో ఎరువుల కోసం తొక్కిసలాట జరిగి రైతులు మరణించిన ఘటనలు చోటుచేసుకున్నాయని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు అన్నారు. సోమవారం గజ్వేల్, సిద్దిపేట నియోజకవర్గాల్లో ఆయన విస్తృతంగా పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ముందుచూపుతో గత ఎనిమిదేండ్లుగా తెలంగాణలో రైతులకు ఎరువులు, విత్తనాల కొరత ఏర్పడలేదన్నారు.
పుష్కలంగా కరెంట్, సాగునీరు అందుబాటులోకి తెచ్చామన్నారు. రైతుబంధు, రైతుబీమా అమలు చేస్తూ సంక్షేమ పాలన సాగిస్తున్నామని తెలిపారు. ఈనెల 28 నుంచి యాసంగికి రైతుబంధు అందిస్తామన్నారు. కేంద్ర సర్కారు తెలంగాణను ఇబ్బందులకు గురిచేస్తున్నదని, బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కారు అన్ని మతాలను సమానంగా చూస్తూ పండుగలకు బట్టలు పంపిణీ చేస్తున్నదని తెలిపారు. గర్భిణుల ఆరోగ్య సంరక్షణ కోరి త్వరలో కేసీఆర్ న్యూట్రీషన్ కిట్లను పంపిణీ చేస్తామన్నారు. పేదల మేలుకోరే పల్లె, బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసినట్లు మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.
– సిద్దిపేట/ గజ్వేల్ రూరల్, డిసెంబర్ 19
గజ్వేల్ రూరల్, డిసెంబర్19: దేశంలోని బీజేపీ పాలిత రాష్ర్టాల్లోనే రైతులు ఇబ్బందులు పడుతున్నారని, తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను చూసి మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల రైతులు తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తున్నారని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సోమవారం గజ్వేల్ ఏఎంసీ మార్కెట్లో ఆత్మ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సీఎం కేసీఆర్ రైతుల గురించి ఆలోచించే వ్యక్తి అని, వారికి ఎలాంటి ఇబ్బంది కలుగొద్దని ఈనెల 28 నుంచి ప్రతి రైతు ఖాతాలో రైతుబంధు డబ్బులు వేసేలా నిర్ణయించారన్నారు.
రాష్ట్రంలో పచ్చగా పంటలు పండుతున్నాయంటే అది కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల వచ్చిన గోదావరి నీళ్లతోనే అన్నారు. బాయికాడ మీటర్లు పెడ్తలేమని రాష్ర్టానికి వచ్చే రూ.12 వేల కోట్లను కేంద్రం నిలిపేసిందన్నారు. రాష్ర్టానికి వచ్చే రూ.40 వేల కోట్లను కేంద్రం ఆపేసి అభివృద్ధిని అడ్డుకుంటుందన్నారు. గతంలో యాసంగి పంట అంటే గాలిలో దీపం.. ఇప్పుడు సంవత్సరానికి రెండు పంటలు పండిస్తూ సంబురపడే పరిస్థితి వచ్చిందన్నారు.
2014కు ముందు రాష్ట్రంలో రైతుల పరిస్థితి.. నేడు చూస్తే ఎలాఉందో అందరికీ తెలుస్తుందన్నారు. ఎరువుల కోసం బీజేపీ పాలిత రాష్ట్రం మధ్యప్రదేశ్‌లో ఇటీవల జరిగిన తొక్కిసలాటలో రైతులు మృతి చెందారన్నారు. ముందు చూపు కలిగిన సీఎం కేసీఆర్ రైతులకు ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడంతో నేడు తెలంగాణలో రైతులు సంతోషంగా ఉన్నారన్నారు. ఆయిల్ పామ్ పంటను సాగు చేసేందుకు రైతులు ముందుకు రావాలని, జిల్లాలో అవసరమయ్యే మొక్కలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయన్నారు.
గజ్వేల్ ఆత్మ కమిటీ ప్రమాణస్వీకారోత్సవం
గజ్వేల్ ఆత్మ కమిటీ నూతనంగా చైర్మన్ ఉడేం కృష్ణారెడ్డి, డైరెక్టర్లతో అధికారులు, మంత్రి తన్నీరు హరీశ్‌రావు సమక్షంలో ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం చైర్మన్ కృష్ణారెడ్డి, డైరెక్టర్లను మంత్రి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి సన్మానించారు.
కార్యక్రమంలో జడ్పీచైర్‌పర్సన్ రోజాశర్మ, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ దేవేందర్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు భూంరెడ్డి, ఎలక్షన్‌రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర కమిటీ సభ్యుడు దేవీ రవీందర్, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, మున్సిపల్ మాజీ చైర్మన్ భాస్కర్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కరుణాకర్‌రెడ్డి, మధు, పట్టణ అధ్యక్షుడు నవాజ్‌మీరా పాల్గొన్నారు.