మిరుదొడ్డి, జూన్ 24: కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రత్యేకాధికారుల పరిపాలనలో అన్ని తామై పనులు నిర్వహిస్తున్న గ్రామ కార్యదర్శులకు (Panchayat Secretary) కష్టాలు తప్పడం లేదు. మిరుదొడ్డి మండల వ్యాప్తంగా 10 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. సర్పంచ్ల పదవీ కాలం ముగిసి సుమారు 18 నెలలు గడుస్తున్న ఇప్పటీ వరకు ప్రజా ప్రతినిధులు లేకపోవడంతో కార్యదర్శులు గ్రామాల్లో అన్ని తామై పనులు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల కాకున్నా పైఅధికారుల ఆదేశాల మేరకు తమ సొంతంగా జేబుల నుంచి డబ్బులు ఖర్చులు పెట్టుకొని గ్రామాల్లో ప్రజలు నుంచి ఇబ్బందులు తలెత్తకుండా కాలం ఎల్లదీస్తున్నారు.
10 గ్రామ పంచాయతీల్లో 22 లక్షలు ఖర్చు
మండల కేంద్రమైన మిరుదొడ్డితో పాటు మండల వ్యాప్తంగా మొత్తం 10 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అల్వాలలో రూ.1 లక్ష 75 వేలు, అందెలో రూ.3 లక్షల 26 వేలు, చెప్యాలలో రూ.3 లక్షల 4 వేలు, కాసులాబాద్లో రూ.2 లక్షల 10 వేలు, లక్షీనగర్లో రూ.1 లక్ష 74 వేలు, లింగుపల్లిలో రూ.2 లక్షల 8 వేలు, కొండాపూర్లో రూ.లక్ష 94 వేలు, మల్లుపల్లిలో రూ.2 లక్షల 96 వేలు, మిరుదొడ్డిలో రూ.6 లక్షల 48 వేలు, ధర్మారంలో రూ.లక్ష 78 వేలు చొప్పున కార్యదర్శులు అందరు కలిసి మొత్తం రూ.26 లక్షల 28 వేలు వరకు ఖర్చులను చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కానప్పటికీ పల్లెల్లో తడి పోడి చెత్తను డంపింగ్ యార్డులకు తరలించడానికి డీజిల్ పోస్తూ వాహనాలు చెడిపోతే వాటిని రిపేరు చేయడానికి, వీధి లైట్ల ఏర్పాటు, మురుగు కాలువల్లో దోమల నివారణ మందులను పిచికారి చేయడానికే కాకుండా ఇతర ఖర్చుల నిమిత్తం ఖర్చులను సొంత డబ్బులను పెట్టారు. కానీ నేటికి నయా పైసా కూడా ప్రభుత్వం నుంచి కార్యదర్శులకు రాలేదు. దీనికి తోడు మిషన్ భగీరథ పైపులైన్ గ్రామాల్లో ఎక్కడైనా పగిలి పోయినా.. లీకైనా కార్యదర్శులే వాటికి సంభందించిన పరికరాల కొనుగోలు కొరకు డబ్బులు చెల్లిస్తూ కాలం ఎల్లదీస్తున్నారు. ఆర్థికంగా ఇబ్బందులు తప్పడం లేదని తమలో తామే బధపడుతున్నారు.
కార్యదర్శులు బదిలీ అయితే అంతే సంగతులు
రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వూలు జారీ చేసి కార్యదర్శులను బదిలీ చేస్తే గ్రామాల అభివృద్ధికి తాము సొంతంగా అప్పులు చేసి పెట్టిన డబ్బులు మాకు రావేమో..?.. అంటూ కార్యదర్శులు తమ బాధలను వెలిబుచ్చుతూ తమ బాధలను వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, పై అధికారులు స్పందించి గ్రామ పంచాయతీల అభివృద్ధి కొరకు నిధులను విడుద చేసి కార్యదర్శులు సొంతంగా పెట్టిన డబ్బులను చిరు ఆ ఉద్యోగులకు చెల్లించి ఆదుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
కుంటుపడిన గ్రామాభివృద్ధి
బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే గ్రామాల్లో అభివృద్ధి శర వేగంగా కొనసాగింది. కాని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలలు గడుస్తున్న అభివృద్ధి మాత్రం ఎక్కడా జరగకుండా కుంటు పడిందని ఆయా గ్రామాల ప్రజలు బాహాటంగానే ఆరోపిస్తున్నారు.