మెదక్ ఎంపీ, టీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్‌రెడ్డి
దుబ్బాకలో టీఆర్ఎస్ ఆగ్రహ జ్వాల
నల్ల జెండాలతో బైక్ ర్యాలీ
బస్‌స్టాండ్ వద్ద ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దహనం
దుబ్బాక టౌన్/ దుబ్బాక, ఫిబ్రవరి 9: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై దుబ్బాక నియోజకవర్గ కేంద్రంలో టీఆర్ఎస్ శ్రేణులు బుధవారం నిరసనలు వ్యక్తం చేశారు. మెదక్ ఎంపీ, టీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ శ్రేణులు నల్ల మాస్క్‌లు, నల్ల కండువాలతో పట్టణంలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక బస్‌స్టాండ్ వద్ద ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్‌తో కలిసి మాట్లాడుతూ దేశ ప్రధాని తెలంగాణపై అక్కసు వెల్లగక్కడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ప్రధాని మాట్లాడారని మండిపడ్డారు. తెలంగాణపై ఉన్న వ్యతిరేకత ప్రజలకు అర్థమైందన్నారు. తెలంగాణ మేమే తెచ్చామని గొప్పలు చెప్పుకుంటున్న రాష్ట్ర బీజేపీ నాయకులు ఏ ముఖం పెట్టుకొని ప్రజల ముందుకు వస్తారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణకు రావలసిన నిధులు ఎందుకు నిలుపుతున్నారో ప్రధాని వ్యాఖ్యల ద్వారా అర్థమైందన్నారు. అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం ప్రధాని మోదీకి, బీజేపీ నాయకత్వానికి ఇష్టం లేదన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అసత్యాలతో కాలం వెల్లదీస్తున్నాడని, నోరు తెరిస్తే అబద్దాలేనన్నారు. దేశ్‌కీ నేతలా మాట్లాడితే సరిపోదని ప్రజల మనస్సులను గెలువాలని చురకలంటించారన్నారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు నియోజకవర్గ ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయాడన్నారు. అధికారులను భయపెట్టించి గొప్పలు చెప్పుకోవడం కాదని ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నేరవేర్చడంపై దృష్టి పెట్టాలని హితవు చెప్పారు. సంక్షేమంలో దేశంలోనే ముందు వరుసలో ఉన్న తెలంగాణను చూడలేకనే ప్రధాని మోదీ రాష్ట్ర విభజనపై అక్కసు వెల్లగక్కుతూ రెండు తెలుగు రాష్ర్టాల మధ్య చిచ్చు పెడుతున్నాడని టీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆరోపించారు. బీజేపీకి సరైన సమయంలో తెలంగాణ ప్రజలు సరైన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. దేశంలో సీఎం కేసీఆర్ పేరు మార్మోగుతూ టీఆర్ఎస్ పథకాలే అన్ని రాష్ర్టాల్లో అమలు జరుగుతుండటం చూసి ఓర్వలేకనే ఇలాంటి కుట్రలకు ప్రధాని లాంటి వ్యక్తి దిగజారడం సిగ్గుచేటన్నారు. దేశంలోనే నెంబర్ వన్ జీడీపీ ఉన్న రాష్ర్టాన్ని అణగదొక్కాలని, సీఎం కేసీఆర్‌కు, టీఆర్ఎస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలనే అక్కసుతో బీజేపీ ప్రభుత్వం పని చేస్తుందని ప్రభాకర్‌రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ప్రజలను కించపరిచే విధంగా మాట్లాడిన ప్రధానితో పాటు స్థానిక బీజేపీ నాయకత్వం భేషరతుగా క్షమాపణ చెప్పాలని ఎంపీ ప్రభాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బక్కి వెంకటయ్య, మున్సిపల్ చైర్పర్సన్ గన్నె వనితాభూంరెడ్డి, ఎంపీపీ కొత్త పుష్పలతా కిషన్‌రెడ్డి, ఏఎంసీ చైర్పర్సన్ బండి శ్రీలేఖరాజు, టీఆర్ఎస్ మున్సిపల్ శాఖ అధ్యక్షుడు వంశీకృష్ణ, మండలాధ్యక్షుడు మల్లారెడ్డి, కౌన్సిలర్లు ఇల్లందుల శ్రీనివాస్, ఆస స్వామి, ఆస యాదగిరి, నాయకులు రొట్టె రాజమౌళి, గుండబోయిన వెంకటేశ్వర్, అమ్మన రవీందర్‌రెడ్డి, వనం రమేశ్, సత్యానందం, నందాల శ్రీకాంత్, ఆకుల దేవేందర్, భీమసేన, గుండెల్లి ఎల్లారెడ్డి, నారాగౌడ్, బట్టు ఎల్లం, రాజిరెడ్డి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు రాజయ్య తదితరులున్నారు.