సీఎం కేసీఆర్ హయాంలో.. బీఆర్ఎస్ పాలనలో నారాయణఖేడ్ నియోజకవర్గం తలరాత పూర్తిగా మారిపోయిందని విద్య, వైద్యం,విద్యుత్‌తో పాటు అన్ని సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శనివారం మనూరు మండలం బోరంచలో బసవేశ్వర ఎత్తిపోతల పనులతో పాటు జగన్నాథ్‌పూర్, నాగల్గిద్దలో పలు అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు హామీలివ్వడం తప్ప ఒక్క పని చేయలేదన్నారు. గతంలో చుక్క నీటి కోసం అల్లాడిన ఈ ప్రాంతానికి మిషన్ భగీరథ ద్వారా పుష్కలంగా తాగునీటిని అందిస్తున్నామని, త్వరలో గోదావరి నీళ్లు తెచ్చి బోరంచ పోచమ్మ కాళ్లు కడుగుతామన్నారు. ఒకప్పుడు బతుకుదెరువు కోసం ఇక్కడి ప్రజలు వలసలు వెళ్లారని, నేడు వేరే రాష్ర్టాల నుంచి జనం ఇక్కడికి వలస వచ్చి ఉపాధి పొందుతున్నారన్నారు. ఎత్తిపోతలకు భూములిచ్చిన రైతుల త్యాగం వెలకట్టలేనిదని, వారికి అన్నివిధాలా అండగా ఉండి ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
– నారాయణఖేడ్/మనూరు/నాగల్గిద్ద, ఫిబ్రవరి 18
నారాయణఖేడ్/ మనూరు/ నాగల్గిద్ద, ఫిబ్రవరి 18: బీఆర్ఎస్ అధికారం చేపట్టి భూపాల్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత నారాయణఖేడ్ నియోజకవర్గం తలరాత పూర్తిగా మారిపోయిందని, విద్య, వైద్యం, విద్యుత్రంగాలతో పాటు ఇప్పుడు కాల్వల ద్వారా గోదావరి జలాలను తెచ్చేందుకు పనులు కూడా ప్రారంభించుకున్నామని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శనివారం పలు అభివృద్ధి పనులను ప్రారంభించే నిమిత్తం నారాయణఖేడ్ నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి మనూరు మండలం బోరంచలో బసవేశ్వర ఎత్తిపోతల పథకం పనులను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడారు. గతంలో ఉన్న ముఖ్యమంత్రులు చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డిలు ఇక్కడికి వచ్చి ఎన్నో కథలు చెప్పారే తప్ప ఏ ఒక్క పని కూడా చేయలేదన్నారు. ఒకప్పుడు చుక్క నీటి కోసం అల్లాడే ఈ ప్రాంతంలో మిషన్ భగీరథ ద్వారా తాగునీటి గోస తీర్చడమే కాకుండా గోదావరి జలాలను తరలించి చరిత్ర తీరగరాస్తున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదన్నారు. గతంలో సింగూరు జలాలు మెదక్ జిల్లా హక్కు అనే నినాదం గోడల మీద రాతలకే పరిమితమైందని, సీఎం కేసీఆర్ ఆ నినాదానాన్ని నిజం చేసి చూపుతున్నారన్నారు.
కాళేశ్వరం నుంచి గోదావరి జలాలను సింగూరుకు తరలించి ఉమ్మడి మెదక్ జిల్లాను సస్యశ్యామలం చేసే దిశగా నారాయణఖేడ్ నియోజకవర్గంలో 2 లక్షల ఎకరాలకు, అందోల్ నియోజకవర్గంలో 2.26 లక్షలు, జహీరాబాద్ నియోజకవర్గంలో 1.31 లక్షలు, సంగారెడ్డి నియోజకవర్గంలో 84 వేలు, పటాన్చెరు నియోజకవర్గంలో 25 వేలు, నర్సాపూర్ నియోజకవర్గంలో 81 వేల ఎకరాలకు సాగునీరందిస్తామన్నారు. కాంగ్రెస్, టీడీపీలు సింగూరు జలాలను ఎన్నికలప్పుడు వాడుకుని ఓట్లు దండుకున్నారన్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో 60 ఏండ్ల కాంగ్రెస్, టీడీపీల పాలనలో ప్రజలకు ఒరిగింది కేసులు, బెయిల్, జైలు మాత్రమేనని, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు స్వతంత్రంగా జీవిస్తూ స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారన్నారు. ఇక్కడి ప్రజలు బతుకు దెరువు కోసం వలస వెళ్లే పరిస్థితి నుంచి ఇతర ప్రాంతాల కూలీలు పనుల కోసం ఇక్కడికి వలస రావడం బీఆర్ఎస్ ప్రభుత్వ ఘనత కాదా అని ప్రశ్నించారు.
సీఎం కేసీఆర్ రైతుల విలువ పెంచడం వల్ల ఈ ప్రాంతంలో భూముల ధరలు రూ.65 వేల ఎకరం నుంచి రూ.60 లక్షలకు పెరిగాయని, బెంగాల్, ఉత్తర్‌ప్రదేశ్, కర్ణాటక, బీహారు తదితర ప్రాంతాల కూలీలు ఇక్కడ పత్తి మిల్లు, డైయిరీ ఫారమ్‌లతో పాటు వ్యవసాయ పనులు చేపట్టేందుకు వలస వస్తున్నారన్నారు. కొన్ని పార్టీలు దేవుడిపై రాజకీయాలు చేస్తున్నాయని, సీఎం కేసీఆర్ మాత్రం సాగునీటి ప్రాజెక్టులకు, బ్యారేజ్‌లు, రిజర్వాయర్లకు, జిల్లాలకు దేవుడి పేర్లు పెట్టి దేవుడిపై భక్తిని చాటుకుంటున్నారన్నారు. నారాయణఖేడ్, జహీరాబాద్ సాగునీటి ప్రాజెక్టులకు బసవేశ్వర, సంగమేశ్వర ప్రాజెక్టులుగా నామకరణం చేశారని గుర్తు చేశారు. యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి దేవాలయాన్ని సీఎం కేసీఆర్ భూతల వైకుంఠం మాదిరిగా తీర్చిదిద్దారన్నారు.
నారాయణఖేడ్‌లో జర్నలిస్టుల డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ ప్రాంతం రాష్ట్ర సరిహద్దున ఉండడం చేత ఇక్కడి జర్నలిస్టులు కర్ణాటకలోని డబుల్ ఇంజిన్ సర్కార్, తమ రాష్ట్రంలోని డబుల్ ఇంప్యాక్ట్ సర్కార్ల మధ్య తేడాను ఎత్తిచూపే కథనాలను రాసి బాధ్యతాయుతమైన పాత్ర పోషించాలన్నారు. అన్ని మండలాల జర్నలిస్టులకు నారాయణఖేడ్‌లో ఒకేచోట ఇండ్ల స్థలాలు కేటాంచడం గొప్ప విషయమని, డబుల్ బెడ్రూం ఇండ్లతో పాటు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు. బసవేశ్వర ఎత్తిపోతల పథకం పనులు నిర్విఘ్నంగా పూర్తి కావాలని బోరంచ నల్లపోచమ్మ తల్లికి మొక్కుకుని బంగారు ముక్కుపుడక చేయిస్తానన్నారు. బసవేశ్వర ఎత్తిపోతల పథకం కోసం భూములు ఇచ్చిన భూ నిర్వాసితులను అన్ని విధాలుగా అండగా ఉండి ఆదుకోవడమే కాకుండా వారికి మెరుగైన పరిహారం ఇస్తామన్నారు. భూ నిర్వాసితుల త్యాగం వెలకట్టలేనిదని, భవిష్యత్‌లో సస్యశ్యామలమైన నారాయణఖేడ్ ప్రాంతం కోనసీమను తలపిస్తున్నదన్నారు.
పలు అభివృద్ధి పనులకు శ్రీకారం
నారాయణఖేడ్ నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి హరీశ్‌రావు నారాయణఖేడ్‌లో రూ.5.84 కోట్లతో నిర్మించనున్న జర్నలిస్టుల డబుల్ బెడ్రూం ఇండ్లకు శంకుస్థాపన, మనూరు మండలం బోరంచలో రూ.1,774 కోట్ల బసవేశ్వర ఎత్తిపోతల పథకం పనులకు ప్రారంభోత్సవం, నారాయణఖేడ్ మండలం జగన్నాథ్‌పూర్‌లో రూ.2.14 కోట్లతో నిర్మించనున్న చెరువు నిర్మాణం పనులకు శంకుస్థాపన, నాగల్గిద్ద మండలం కరస్‌గుత్తిలో రూ.6.68 కోట్లతో నిర్మించిన 30 పడకల దవాఖానను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. కార్యక్రమంలో సంగారెడ్డి జడ్పీచైర్ప్సన్ మంజుశ్రీజైపాల్‌రెడ్డి, కలెక్టర్ శరత్, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, ఆర్డీవో అంబాదాస్ రాజేశ్వర్, ఏఎంసీ చైర్మన్ సువర్ణశెట్కార్, వైస్‌చైర్మన్ విజయ్ బుజ్జి, మున్సిపల్ చైర్పర్సన్ రుబినాబేగం నజీబ్, వైస్‌చైర్మన్ ఆహీర్ పరశురాం, ఎంపీపీలు, జడ్పీటీసీలు చాందిబాయి, జయశ్రీ, మోతీబాయి, లక్ష్మీబాయి రవీందర్‌నాయక్, పుష్పాబాయి, రాజురాథోడ్, తహసీల్దార్లు మురళీధర్, తారాసింగ్, కిషన్, సర్పంచ్ రేణుక పండరి, ఎంపీటీసీ రాములు తదితరులు పాల్గొన్నారు.
సైకత లింగ దర్శనం..
సంగారెడ్డి, ఫిబ్రవరి 18: ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు నారాయణఖేడ్‌లో కార్యక్రమాలు ముగించుకుని తిరుగు ప్రయాణంలో జ్యోతిర్వాసు విద్యాపీఠంలో ఏర్పాటు చేసిన సైకత లింగాన్ని దర్శించుకున్నారు. సంగారెడ్డి మండలం ఫసల్వాదిలో మహాశివరాత్రిని పురస్కరించుకుని సైకత లింగాన్ని జ్యోతిర్వాసు విద్యాపీఠం వ్యవస్థాపకుడు మహేశ్వర శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో తీర్చిదిద్దారు. శనివారం నారాయణఖేడ్‌లో పలు కార్యక్రమాలకు హాజరైన మంత్రి తిరుగు ప్రయాణంలో మార్గమధ్యలోని సైకత లింగాన్ని దర్శించుకునేందుకు రాగా, మంత్రికి మహేశ్వరశర్మ సిద్ధాంతి ఘనస్వాగతం పలికి శాలువాతో సన్మానించి, ఆహ్వానించారు. సైకత లింగాన్ని అభిషేకం చేసి భగవంతుడి కృపకు పాత్రులయ్యారు. మంత్రివెంట డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, కలెక్టర్ శరత్, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, డీసీఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్, తహసీల్దార్ విజయ్‌కుమార్, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
రైతులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం
మనూరు, ఫిబ్రవరి 18: రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉంటూ మండల కేంద్రాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. శనివారం నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డితో కలిసి మనూరు మండల కేంద్రం గోదాంలో శనగల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పుష్పాబాయి, స్థానిక సర్పంచ్ శివాజీరావు పాటిల్, నాయకులు నాగేందర్రావు తదితరులు పాల్గొన్నారు.
మంత్రి కృషితో వలసల నివారణ : నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి
మంత్రి హరీశ్‌రావు కృషితో నారాయణఖేడ్ ప్రాంతం నుంచి వలసలు తగ్గి ఇతర ప్రాంతాల వారు మా నియోజకవర్గంలో పనులు చేస్తూ ఉపాధి పొందుతుండడం తమకెంతో గర్వంగా ఉందని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ తమ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నారని రూ.80 కోట్లతో నూతనంగా 8 చెరువుల నిర్మాణంతో పాటు రూ.80 కోట్లతో మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువుల పునరుద్ధరణ, నల్లవాగు ప్రాజెక్టు ఆధునీకరణ, వేగవంతంగా బసవేశ్వర ఎత్తిపోతల పథకం పనులను ప్రారంభించడం వంటి చర్యలు తీసుకోవడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. ఇందుకోసం సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావులకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. బసవేశ్వర ఎత్తిపోతల పథకం భూ నిర్వాసితులను అన్నివిధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
రైతుల జీవితాల్లో వెలుగులు : అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్
బసవేశ్వర ఎత్తిపోతల పథకం రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతుందని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. ఈ పథకం కోసం భూములు ఇచ్చిన నిర్వాసితుల రుణం తీర్చుకోలేనిదన్నారు. బసవేశ్వర ఎత్తిపోతల పథకం ద్వారా అందోల్ నియోజకవర్గంలోని రేగోడ్, వట్పల్లి మండలాల్లోని దాదాపు 40 వేల ఎకరాలకు సాగునీరందనుందన్నారు. అందోల్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసేందుకు బసవేశ్వర, సంగమేశ్వర ప్రాజెక్టులకు రూపకల్పన చేసిన సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
పథకం బాగుంది..
ముఖ్యమంత్రి సారు పంటలకు నీరు అందించేందుకు చేస్తున్న పథకం ఎంతగానో బాగుంది. అప్పుడు ఊర్లల్ల ఇంటింటికీ నల్లనీల్లు ఇస్త అంటే నవ్వినోల్లు.., ఇప్పుడు ఇంటింటికి నల్ల నీల్లు వస్తుంటే చూసి ముక్కుమీద వేలు ఏసుకుంటున్రు. ఇప్పుడు కూడా ఈ పంటలకు నీళ్లు అందవని అంటునోళ్లకు కూడా అట్లనే చూసేలా అయితది. పనులు పూర్తి అయితే ఇక్కడ ఉన్న రైతులకు పంటలు పండించేందుకు నీళ్లు అందుతాయనే నమ్మకముంది.
– అలిగె మాణెమ్మ, మనూరు మండలం, బోరంచ గ్రామం
రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతాయి
బసవేశ్వర పథకం రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతాయి. ప్రభుత్వం రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్న ఈ పథకం నారాయణఖేడ్ ప్రాంత రైతులకు ఎంతగానో ఉపయోగంగా మారుతుంది. ఇలాంటి సర్కారు ఉండాలనే రైతులు కోరుకుంటున్నారు. ఇక్కడ గట్టు భూములు అధికంగా ఉన్నయి. గట్టుభూములకు కూడా సాగునీరు అందితే రైతు రాజు అన్న కల నిజమవుతది. అది సీఎం కేసీఆర్‌తోనే సాధ్యం అవుతదని అందరూ అనుకుంటున్న మాట.
– కిష్టయ్య, మనూరు మండలం, బోరంచ గ్రామం