పటాన్చెరు, డిసెంబర్ 17: ప్రభుత్వ పాఠశాలలు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నాయని సంగారెడ్డి జిల్లా విద్యాధికారి నాంపల్లి రాజేశ్ అన్నారు. శనివారం పటాన్చెరు మండలం ముత్తంగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పేరెంట్స్- టీచర్స్ మీటింగ్‌కు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు తమ పిల్లల చదువుపై ఉన్న సందేహాలకు ఉపాధ్యాయులు సమాధానాలు ఇవడాన్ని పరిశీలించారు. చదువులో తమ పిల్లలు వెనుకబడి ఉన్నారని, ఇంగ్లిష్ సబ్జెక్ట్ అంటేనే పారిపోతున్నారని తల్లిదండ్రులు ఫిర్యాదులు చేయడంతో సంబంధిత టీచర్లు వివరణ ఇచ్చారు. అనంతరం డీఈవో రాజేశ్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థిలో ప్రతిభ ఉంటుందన్నారు. దాన్ని ఒడిసిపట్టుకుని వారిని విద్యావంతులు చేసేందుకు టీచర్లు కృషి చేస్తారన్నారు. గతంలోలా ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలను నిర్లక్ష్యంగా చూడవద్దన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పిస్తున్నామన్నారు.
మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తున్నామన్నారు. స్కూల్ డ్రెస్సులు ఇస్తున్నామన్నారు. ఆటపాటలతో ప్రోత్సహిస్తున్నామన్నారు. నాణ్యమైన చదువుకు ఇప్పుడు సర్కార్ బడులే కేంద్రాలుగా మారుతున్నాయన్నారు. తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలను నిజం చేసే శక్తిసామర్థ్యాలు ఉపాధ్యాయ బృందాలకు ఉన్నాయ న్నారు. మీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తరువాత వారు ఏమి చదివారో తల్లిదండ్రులు అడగాలని సూచించారు. మీరు నిరక్ష్యరాసులు అయిననూ వారు స్కూల్లో ఏమి నేర్చుకున్నారో రోజూ అడుగుతుంటే విద్యార్థులు క్రమశిక్షణతో, జవాబుదారితనంతో విద్యను అభ్యసిస్తారన్నారు. లక్షల రూపాయల ఫీజులున్న కార్పొరేట్ స్కూల్స్ నుంచి వచ్చిన విద్యార్థులు తల్లిదండ్రులు హోంవర్క్, ఏమి నేర్చుకున్నారో అడుగుతారని గుర్తు చేశారు. తల్లిదండ్రులు ఎప్పుడు స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ పెట్టినా తప్పక హాజరవ్వాలని సూచించారు. మీకు ఉన్న డౌట్లను టీచర్లను అడగాలన్నారు. నిర్మాణంలో ఉన్న స్కూల్ బిల్డింగ్, డైనింగ్ హాల్‌ను డీఈవో పరిశీలించారు. కార్యక్రమంలో జడ్పీస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు శారద, పుండరీకం, శశికళ, జయప్రద, రిజ్వాన, శేషాద్రి, కుమార్, నాగేందర్, నవీన, లలిత పాల్గొన్నారు.