కోహీర్, మే 15: రైతులందరూ వాటర్‌షెడ్ పథకాన్ని వినియోగించుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ దానకిశోర్ కోరారు. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని సజ్జాపూర్, ఖానాపూర్, కొత్తూర్ గ్రామాల్లో నిర్వహించిన వాటర్‌షెడ్, ఉపాధి హామీ పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. ప్రతి రైతు తమ పొలం వద్ద తప్పనిసరిగా నీటి కుంటలు నిర్మించుకోవాలని సూచించారు. వాటిని నిర్మించుకునే కూలీలకు రూ.40వేల వరకు బిల్లులు వస్తాయని వెల్లడించారు. వర్షపు నీరు రైతు భూమిలో ఇంకిపోవడం ద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు.
పంటల సాగు కోసం సరిపడా నీరు లభిస్తుందన్నారు. కూలీలు ఉదయం 5.30గంటలకు ఫొటోలు దిగి పని ప్రారంభించి, ఉదయం 10గంటల వరకు పనులు ముగించుకోవాలన్నారు. జూన్‌లో వర్షాలు పడితే పనులు నిలిచిపోతాయని గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గతంలో 15 లక్షల మంది కూలీలు పని చేసేవారని, ప్రస్తుతం 13లక్షల మంది పనులు చేస్తున్నారని వెల్లడించారు. కూలీల సంఖ్య తగ్గిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కూలీలకు సౌకర్యాలు కల్పించి వారికి సరిపడా పనులు కల్పించాలన్నారు. అనంతరం కొత్తూర్(కే)లో నీటి కుంట నిర్మాణానికి జేసీబీ ద్వారా పనులు ప్రారంభించారు.
బిలాల్పూర్ గ్రామంలో దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంఘం దుకాణాన్ని తనిఖీ చేశారు. దుకాణంలో చిరుధాన్యాలను విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. ఈ సందర్భంగా తమకు త్వరగా కూలీ బిల్లులు అందడం ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూమి తన పేరు ఉన్న యజమాని మరణిస్తే వారసత్వ మార్పు కావడం లేదని విన్నవించారు. స్పందించిన ప్రిన్సిపల్ సెక్రెటరీ దానకిశోర్, రైతుల సమస్య పరిష్కారానికి జిల్లా ఉన్నతాధికారులకు తెలియజేస్తామన్నారు. కార్యక్రమంలో డీఆర్డీవో జ్యోతి, అదనపు డీఆర్డీవో బాల్‌రాజ్, ఏపీడీ పూజ, జడ్పీ సీఈవో జానకీరెడ్డి, డీపీవో మల్లారెడ్డి, సర్పంచులు పిల్లి స్వరూప, పద్మావతి, పట్లోళ్ల దయానంద్ తదితరులు పాల్గొన్నారు.