హుస్నాబాద్, జూలై 29: ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు అసౌర్యాలకు నిలయంగా మారాయి. పలు హాస్టళ్లు అద్దె భవనంలో, ఇరుకు గదుల్లో నిర్వహిస్తుండగా మరికొన్ని సొంత భవనాలు ఉన్నప్పటికీ నిర్వహణ లోపంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. సిద్దిపేట జిల్లా హు స్నాబాద్ పట్టణంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షే మ హాస్టళ్ల వార్డెన్ల నిర్లక్ష్యం, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్ల నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. వార్డెన్లు తమ సొంత పనులకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల హాస్టళ్లలో సకాలం లో భోజనం అందడం లేదని, సౌకర్యాలు కూడా ఉండటం లేదని పలు హాస్టళ్ల విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
పట్టణంలోని కరీంనగర్ రోడ్డులో ఉన్న బీసీ సంక్షేమ హాస్టల్లో మరుగుదొడ్ల నిర్వహణ సక్రమంగా లేకపోవడం వల్ల దుర్గంధం వెదజల్లుతోంది. ఈ హాస్టల్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు ఇటీవల పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇందుకు వార్డెన్ నిర్లక్ష్యమే కారణమని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. రాత్రి వేళల్లోనూ బయట తిరుగుతూ విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిసలవుతున్నారని, విద్యార్థులను క్రమశిక్షణగా ఉంచడంలో వార్డెన్లు, సిబ్బంది విఫలమవడమే ఇందుకు కారణమని తల్లిదండ్రులు వాపోతున్నారు.
విద్యార్థులకు వారు ఉంటున్న గదులు, వాడుతున్న మరుగుదొడ్ల వినియోగంపై కనీస అవగాహన కల్పించే వారు కరువయ్యారు. పలు హాస్టళ్లలో ఇప్పటి వరకు బెడ్‌షీట్స్, పుస్తకాలు, దుస్తులు అందలేదు. గదు లు అపరిశుభ్రంగా ఉండటం వల్ల దోమలు వృద్ధి చెంది విషజ్వరాల బారిన పడుతున్నా రు. భోజనం కూడా నాణ్యతగా అందడం లేద ని ఆయా వసతి గృహాల విద్యార్థులు తెలిపారు. ఇప్పటికైనా సంక్షేమ హాస్టళ్ల నిర్వహణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, వివిధ సంఘాల నాయకులు కోరుతున్నారు.
సమస్యల వలయంలో ఎస్సీ హాస్టళ్లు
మద్దూరు(ధూళిమిట్ట), జూలై 29: మద్దూరు, ధూళిమిట్ట మండల కేంద్రాల్లోని ఎస్సీ బాలుర వసతి గృహాలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. కొన్నాళ్లుగా విద్యార్థులు లేక మూతపడిన ఈ రెండు హాస్టళ్లను ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుంచి తిరిగి ప్రారంభించింది. ధూళిమిట్ట హాస్టల్ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. హాస్టల్ భవనం పెచ్చులూడి కింద పడుతున్నాయి. దీనికితోడు డైనింగ్ హాల్ లేకపోవడం వల్ల విద్యార్థులు ఆరుబయటే భోజనం చేయాల్సిన దుస్థితి నెలకొంది. వంటలు చేసేందుకు వంట గది లేకపోవడంతో వంటలను సైతం ఆరుబయటే వండుతున్నారు. మద్దూరు హాస్టల్లో మాత్రం గదుల తలుపులు, కిటికీలు పాడైనప్పటికీ మరమ్మతులు చేయించడం లేదు. అరకొర వసతుల మధ్య మద్దూరు, ధూళిమిట్ట వసతి గృహాల్లో విద్యార్థులు కాలంవెళ్లదీస్తున్నారు.
హాస్టళ్లలో పారిశుధ్య లోపం
మిరుదొడ్డి, జూలై 29: మిరుదొడ్డిలోని బీసీ, ఎస్సీ హాస్టళ్లలో పారిశుధ్యం లోపించింది. విద్యార్థులు భోజనం చేసిన అనంతరం మిగులు ఆహార పదార్థ్ధాలను బకీట్లలో నింపి ఉంచడంలో ఈగలు, దోమలకు నిలయంగా మారింది. బీసీ హాస్టల్లో గత సంవత్సరం తీసిన ఇంకుడు గుంతల్లో వర్షపు నీరు నిలువడంతో దోమలు వృద్ధి చెంది విద్యార్థులకు వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. రాత్రి సమయంలో విద్యార్థులు బాత్రూమ్కి వెళ్తే కనిపించక ఇంకుడు గుంతల్లో పడితే ప్రాణాలుపోయే అవకాశం ఉంది. ప్రభుత్వం, అధికారులు స్పందించి ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.