మెదక్, ఫిబ్రవరి 27(నమస్తే తెలంగాణ) : మున్సిపల్ ఎన్నికల సమయంలో జరిగిన రాజకీయ గొడవల్లో ఎస్సీ, ఎస్టీలపై తప్పుడు కేసులు నమోదు చేయొద్దని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పోలీస్ అధికారులకు సూచించారు. శనివారం మెదక్ కలెక్టరేట్లో జరిగిన సమీక్ష సమావేశంలో వెంకటయ్య మాట్లాడుతూ.. మెదక్ పట్టణంలోని పిట్లం బేస్‌లో జరిగిన ఎన్నికల గొడవలో ఎస్సీలపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు పెట్టడం సరైంది కాదన్నారు. ఎస్సీ, ఎస్టీలపై దాడులు జరిగితే అరికట్టాల్సిన పోలీసులే తప్పుడు కేసు నమోదు చేస్తే రక్షణ ఎవరు కల్పిస్తారని ప్రశ్నించారు.
మెదక్ పట్టణంలోని పిట్లం బేస్‌లో ఎన్నికల గొడవలపై ఎస్సీలపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి జైలు పాలు చేశారని డిబిఎఫ్ నేత శంకర్ చైర్మన్‌కు విన్నవించారు. స్పందించిన చైర్మన్ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని అబాసు పాలు చేయొద్దని హితవు పలికారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పై అలసత్వం వద్దని సూచించారు. నర్సాపూర్ పెద్ద చింతకుంట గిరిజనులపై జరిగిన దాడి కేసు విచారణలో ఐవోలు మార్చాలని చైర్మన్ ఎస్పీని ఆదేశించారు. జిల్లా కేంద్రంలో అంబేద్కర్ భవనానికి మార్చి 26 వరకు స్థలానికి కేటాయించి భవన నిర్మాణం ప్రారంభించాలని ఆర్డీవోను ఆదేశించారు.
హవేలి ఘనపూర్ తదితర గ్రామాలలో నెలకొన్న భూమి సమస్యలను 45 రోజులలో పరిష్కరించాలని ఆదేశించారు. నరసాపూర్ మండలం మమతాబాద్ లోని గిరిజన ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసి వసతులపై నాణ్యమైన భోజనం పై ఎస్సీ ఎస్టీ కమిషన్‌కు నివేదిక సమర్పించాలని జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని ఆదేశించారు. బాధితులకు నష్ట పరిహారం అందించడంలో నిర్లక్ష్యాన్ని విడనాడాలన్నారు. లైంగిక దాడి, సాంఘిక బష్కరణ తదితర కేసులలో బాధితులకు పక్కా ఇండ్లను అందించాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు రాంబాబు నాయక్, జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేష్, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి శంకర్ పాల్గొన్నారు.