కోహీర్, ఫిబ్రవరి 26: సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని బడంపేట రాచన్నస్వామి దేవాలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆదివారం ఉదయం ఐదు గంటలకు జహీరాబాద్‌కు చెందిన కౌలాస్ పరివార్ ఆధ్వర్యంలో శివలింగానికి ప్రత్యేక పూజలు చేశారు. రుద్రాభిషేకం, మహా మంగళహారతి, అన్నపూజ, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు. పూలతో అందంగా అలంకరించిన మండపంలో దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్ఠించారు. మంగళవాయిద్యాలు, వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.
సాంప్రదాయం ప్రకారం అమ్మవారికి తాళి కట్టించారు. దేవతామూర్తుల పాదాల వద్ద అక్షింతలు వేసి ఆశీస్సులు పొందారు. స్వామివారి బ్రహ్మోత్సవాలకు తెలుగు రాష్ర్టాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఈవో శివరుద్రప్ప, ఆలయ కమిటీ చైర్మన్ రాజుస్వామి, సొసైటీ చైర్ పర్సన్ స్రవంతీరెడ్డి, జగదీశ్వర్‌స్వామి, గోవర్ధన్‌రెడ్డి, మ్యాథరి ఆనంద్, శివానంద్, బక్కారెడ్డి, మొగులయ్య, శివమూర్తిస్వామి పాల్గొన్నారు.

ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి…
ఉత్సవాలకు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, స్థానిక ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు హాజరయ్యారు. వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ గర్భగుడిలోని శివలింగానికి జలాభిషేకం, క్షీరాభిషేకం, మహామంగళహారతి నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వారిని పూలమాలలు, గజమాల, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఆలయం చుట్టూ సీసీ రోడ్డు, రాజగోపురాలు, ప్రాకార మండపాలు, దేవుని చెరువును మినీ ట్యాంక్‌బాండ్‌గా రూపొందించాలని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో విన్నవించారు.

గ్రామ ఆర్‌ఆండ్‌బీ రోడ్డు నుంచి ఆలయం వరకు రెండు డబుల్‌లేన్ రోడ్డు, బటర్‌ఫ్లై లైట్లు, భక్తుల కోసం విశాలమైన హాలు నిర్మించాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్‌రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, కలెక్టర్ డాక్టర్ శరత్, ఈవో శివరుద్రప్ప, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నర్సింహులు, పీఏసీఎస్ చైర్ పర్సన్ స్రవంతీఅరవింద్రెడ్డి, నామ రవికిరణ్ గుప్త, తదితరులు పాల్గొన్నారు.
