సిద్దిపేట, ఏప్రిల్ 18(నమస్తే తెలంగాణ ప్రతినిధి): కేంద్ర సాహిత్య అవార్డు రావడం అనేది సిధారెడ్డికి కాదు.. అవార్డుకే అలంకారంగా భావిస్తున్నట్లు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. అవార్డు అనేది సిద్దిపేటకు, తెలంగాణ రాష్ర్టానికి, కవులు, కళాకారులకు దక్కిన గొప్పగౌరవమన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విపంచి కళా నిలయంలో శనివారం రాత్రి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, ప్రఖ్యాత కవి, డాక్టర్ నందిని సిధారెడ్డికి పౌర సన్మానం జరిగింది.
ఈ సందర్భంగా పలువురు కవులు, సాహితీకారులు, ఉద్యోగులు, వ్యాపారవర్గాల వారు ఆయన్ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ… ఉద్యమ సమయంలో రాష్ట్రమంతా సిద్దిపేట వైపు చూసింది.. కేసీఆర్ ఇక్కడి నుంచి జెండాఎత్తి తెలంగాణ ఉద్యమం ప్రారంభించడం వల్ల ఉద్యమానికి సిద్దిపేట పెట్టింది పేరు అన్నారు. జాతీయ సాహిత్య అవార్డు రావడం కూడా దేశం, రాష్ట్రం సిద్దిపేట వైపు చూసేలా చేసిన సిధారెడ్డిని మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నానన్నారు.
బందా రం మట్టిబిడ్డ, సిద్దిపేట జిల్లా ముద్దుబిడ్డ సిధారెడ్డి పదవులు, డబ్బులు ఆస్తుల కంటే సాహి త్యం మీద, సామాజిక సమస్యలపై ముక్కుసూటి మనస్తత్వంతో పనిచేసే వ్యక్తిత్వం ఆయనదని చెప్పారు. ఆనాడు మంజీరా రచయిత సంఘం ద్వారా ఈ ప్రాంతంలో జరిగిన ఫేక్ ఎన్కౌంటర్లు, అంటరానితనం, రైతుల ఆత్మహత్యలు, మద్యపాన నిషేధం, వలసలు, నీటిగోస ఇలా అనేక అంశాల్లో ప్రత్యక్షంగా పాల్గొనేవారన్నారు. ఎన్నో పుస్తకాలు, రచనల ద్వారా ప్రజల్లో చైతన్యం నింపారన్నారు.
సన్మానాలకు సిధారెడ్డి చాలా దూరంగా ఉండేవారని హరీశ్‌రావు తెలిపారు. సాదాసీదాగా, పొగడ్తలకు ఇంకా దూరమన్నారు. ఆనాడు సిద్దిపేటకు, ఉద్యమానికి దూరమవుతున్నానని చెప్పి కామారెడ్డిలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌గా ప్రమోషన్ వస్తే దానిని వదులుకొని తిరిగి వచ్చి సిద్దిపేటకు, తన సాహిత్యానికి, ఉద్యమానికి దగ్గరగా ఉన్న వ్యక్తిత్వం ఆయనది అని చెప్పారు.
తెలంగాణ తల్లి రూపం మారితే తెలంగాణ తల్లికి అవమానం జరిగిందని కోటి రూపాయల నగదును తృణప్రాయంగా త్వజించారన్నారు. ఎవరైనా ఏదైనా కొంత స్థిరాస్తి కూడబెట్టాలని చూస్తారు, కానీ సిధారెడ్డి స్థిరాస్తి గురించి చూడలేదు.. స్థిర అస్తిత్వమే ప్రాణంగా భావించారన్నారు. ఉద్యమంలో కూడా తెలంగాణ రచయితల వేదిక ఏర్పాటు చేసి మొట్టమొదటి అధ్యక్షుడిగా ఉండి రాష్ట్ర వ్యాప్తంగా కవులు, కళాకారులు, రచయితలను ఉద్యమం వైపు మళ్లించడంలో వారు చేసిన కృషి గొప్పదన్నారు. వారు అందించిన పాట నాగేటి సాలల్లా తెలంగాణ ఉద్యమంలో మార్మోగిందన్నారు.
ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ బకి వెంకటయ్య, ఎమ్మె ల్సీ దేశపతి శ్రీనివాస్, టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ, వివిధ సంఘాల ప్రతినిధులు దేవీప్రసాద్, కె.అంజయ్య, రంగాచారి మాట్లాడారు. కార్యక్రమంలో వివిధ సంఘాల ప్రతినిధులు, నాయకులు కడవేరుగు రాజానర్సు, వేలేటి రాధాకృష్ణశర్మ, మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, గ్యాదరి పరమేశ్వర్, పాపయ్యగౌడ్, విక్రమ్‌రెడ్డి, శ్రీహరి యాదవ్, సాహితి మిత్రులు, పౌర, ప్రజా, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని తెలంగాణ సంస్కృతిని ప్రేమించే వారి కోసం అంకితం చేస్తున్నట్లు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, ప్రఖ్యాత కవి, డాక్టర్ నందిని సిధారెడ్డి చెప్పారు. తెలుగు భాష, తెలంగాణ సంస్కృతి రెండు ఉండాలి.. ఆదిశగా ఇంకా రాస్తానన్నారు. పదేండ్లలో తెలుగు మహాసభలు అనే పేరుతో జరిపిన మానవుడు లేడని, అలాంటి దశలో 42 దేశాలు 18 రాష్ర్టాల నుంచి తెలుగు ప్రతినిధులను పిలిపించి సభ చేయాలనే ఆలోచన కేసీఆర్‌ది అని చెప్పారు. అది కూడా తన ద్వారా చేయడం, నిర్వాహణ కోసం రూ.50 కోట్లు చేసి చాలా అద్భుతంగా చేశామన్నారు.
దీనికి కేసీఆర్ చాలా సంతృప్తి చెందారన్నారు. వెయ్యి కోట్లు పెట్టినా రాని కీర్తి వచ్చిందని కేసీఆర్ అన్నాడని వివరించారు. పోస్టు అనేది కాదు.. రాయడం పరమార్థం..తాను పుట్టింది రాయడం కోసం.. మనుషులను ప్రేమించడం కోసం.. దుఃఖంలేని సమాజ నిర్మాణానికి, బాధ్యత కోసమన్నారు. తాను రాయాల్సింది ఇంకా జీవితంలో ఉంది … ఇంకా రాస్తాను.. పురస్కారాలు రాయడం వెనకాల రావాలి … కానీ పురస్కారాల వెనుక తాను వెళ్లే ప్రశ్నే లేదన్నారు. మీ కోసం నేను నిలబడుతానని హామీ ఇస్తున్నానన్నారు. మీ సహకారం ఎల్లప్పుడూ ఉండాలని.. హరీశ్‌రావు, దేశపతి శ్రీనివాస్, అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు.