గజ్వేల్, మే 21: రైతులు జీలుగ సాగు చేస్తే చక్కటి ఫలితాలు సాధించవచ్చు. తక్కువ సారవంతమైన భూముల్లో నల్లటి మట్టిని వేస్తే మంచి దిగుబడులు వస్తాయి. రైతులు మట్టిని వేసే బదులు నేల స్వభావాన్ని బట్టి పచ్చిరొట్టె ఎరువుల సాయంతో సారవంతంగా మార్చుకోవచ్చు. అందుకోసం రైతులు అందుబాటులో ఉన్న జీలుగ విత్తనాలను సాగు చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. నేల స్వభావాన్ని బట్టి జీలుగను సాగు చేసుకుంటే తర్వాత వేసే పంటలకు అనుకూలంగా ఉంటుంది. పచ్చిరొట్టె ఎరువుల కోసం నిర్దేశించిన మొక్కలను పొలంలో కలియదున్నడంతో అవి కుళ్లి మొక్కలకు సారవంతమైన పోషకాలు అందిస్తాయి.
అందుబాటులో విత్తనాలు
తెలంగాణ ప్రభుత్వం సబ్సిడీపై జీలుగ విత్తనాలను ఆయా మండల కేంద్రాల్లోని ఆగ్రో సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచింది. రైతు సంక్షేమ కోసం కృషి చేస్తున్న ప్రభుత్వం పంటల్లో అధిక దిగుబడి రావాలనే పంపిణీ చేస్తున్నది. అందుకోసమే జీలుగ విత్తనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏకవార్షిక మొక్కల్లో ప్రథమస్థానం జీలుగదే. మొక్కలు నాటిన 30 నుంచి 35 రోజుల్లోనే ఏపుగా పెరుగుతాయి. దుక్కిలో 30 కిలోల యూరియా వేసిన తర్వాత ఎకరానికి 12 కిలోల జీలుగ విత్తనాలు చల్లుకోవాలి. మొక్కలు బాగా పెరిగేందుకు క్రమపద్ధతిలో ఉండే విధంగా చూడాలి. జీలుగను సాగు చేసిన తర్వాత 30 రోజుల్లో ఏపుగా పెరిగి పూతదశకు చేరుకుంటుంది. ఆ సమయంలో మొక్కలను మొదళ్ల వద్ద కత్తిరించాలి. లేనిచో రొటోవేటర్ సాయంతో పొలం అంతా కలియదున్నా లి. దున్నిన అనంతరం 100 కిలోల సింగిల్ సూపర్ పాస్పేట్ను దుక్కిలో వే యాలి. సూపర్ పాస్పేట్ వల్ల మొక్కల అవశేషాలు బాగా కుళ్లి పచ్చిరొట్టె ఎరువుగా తయారవుతుంది. పొలంలో జీలుగ కుళ్లేదశలో నీటిని సక్రమంగా అం దించాలి. 30కిలోల బ్యాగును సబ్సిడీకి ప్రభుత్వం రూ.843 విక్రయిస్తున్నది.
జీలుగతో లాభాలు
* పొలంలో జీలుగను కలియదున్నిన తర్వాత అవి నేలకు, తర్వాత వేసే పంటలకు విశేషమైన లాభాలు అందిస్తుంది.
* ప్రధాన పంటకు ముందస్తుగా నేలను తయారు చేస్తుంది.
* జీలుగ సాగుతో మూడు టన్నుల పచ్చిరొట్టె ఎరువు లభిస్తుంది.
* మొక్కలకు 2శాతం నత్రజని, సూపర్ పాస్పేట్ను అదనంగా అందిస్తాయి.
* జింక్ మాంగనీస్, ఇనుము, క్యాల్షియం వంటి సూక్ష్మదాతువులను పంటకు చేకూర్చుతాయి.
* నేలపై కరగని మూలకాలను పంటకు అనుకులంగా మార్చుతాయి.
* నీటి నిల్వ సామర్థ్యాన్ని అధికంగా పెంచుతుంది.
* నేల సహజ మిత్రులైన వానపాముల ఉత్పత్తికి దోహదం చేస్తాయి.
* లెగ్యూజాతికి చెందిన మొక్కకావడంతో వేర్లలో నత్రజని స్థిరీకరణ అధికంగా ఉంటుంది.
* తుంగ, గెరిక వంటి కలుపు మొక్కలను అడ్డుకుంటుంది.
సబ్సిడీపై జీలుగ విత్తనాలు
జీలుగ విత్త్తనాలను సబ్సిడీపై అందించేందుకు రైతులకు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో రైతుకు 30 కిలోల విత్తనాలను అందజేయడం జరుగుతుంది. ప్రభుత్వం సబ్సిడీపై అందజేసే ఈ విత్త్తనాలను రైతులు సకాలంలో తీసుకొని వేసుకోవాలి. విత్తనాలను ఆగ్రో సేవా కేంద్రాల్లో విక్రయిస్తున్నాం.
– నాగరాజు, మండల వ్యవసాయధికారి, గజ్వేల్
లాభాలు పొందాల
ఆగ్రో సేవా కేంద్రంలో అందుబాటులో ఉన్న జీలుగ విత్తనాలను రైతులు కొనుగోలు చేసుకొని వాటితో వచ్చే లాభాలు పొందాలి. ప్రభుత్వం సబ్సిడీపై అందజేస్తున్న విత్తనాలు సిద్ధంగా ఉన్నాయి. గతకొద్ది రోజులుగా జీలుగ విత్తనాలను రైతులు కొనుగోలు చేస్తున్నారు.
-గొలి సంతోష్, ఆగ్రో సేవాకేంద్రం నిర్వాహకుడు, గజ్వేల్