మనూరు, ఏప్రిల్ 14: సంగారెడ్డి జిల్లా మనూరు పీఎస్ ఎదుట పోలీస్ బొలెరో వాహ నం ఢీకొని ఏఎస్సై గోవింద్‌నాయక్ మృతి చెందాడు. మనూరు ఎస్సై కోటేశ్వరరావు వివరాల ప్రకారం… నారాయణఖేడ్ నియోజకవర్గంలోని ఎన్టీ తండాకు చెందిన గోవింద్‌నాయక్ (59) మనూరు పీఎస్‌లో ఏఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నారు. సోమవారం రాత్రి పెట్రోలింగ్ కోసం విధులు నిర్వహిస్తున్న ఏఎస్సై గోవింద్‌నాయక్, కానిస్టేబుల్ వెంకటేశ్ పీఎస్ ఆవరణంలో ఉన్న తహసీల్ కార్యాలయం ఎదుట నిలబడి పాయింట్ చెక్ చేస్తు న్న సమయంలో పెట్రోలింగ్ వాహనం డ్రైవర్ రామారావు వేగంగా నడుపుతూ ఏఎస్సైని ఢీకొట్టడంతో తీవ్ర గాయాలై మృతిచెందాడు.
ఏఎస్సై ప్రమాదం వల్ల చనిపోలేదని కావాలనే రామారావు హత్య చేశాడని, అందుకే అతను పరారయ్యాడని గోవింద్‌నాయక్ కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. గోవింద్ నాయక్ మృతికి కారణమైన హోంగార్డు రామారావుపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కుటుంబీకులతో పాటు తండావాసులు డిమాండ్ చేస్తున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. మృతుడి కుమారుడు సుప్రిత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
గోవింద్‌నాయక్ కుటుంబాన్ని ఆదుకుంటాం
పోలీస్ వాహనం ఢీకొని మృతి చెందిన ఏఎస్సై గోవింద్ నాయక్ కుంటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పంకజ్ పరీతోష్ తెలిపారు. మంగళవారం మనూరులో సంఘటనా స్థలానికి చేరుకుని పోలీస్ బొలెరో వాహనం ఢీకొట్టిన స్థలం, రక్తపు మరకలను పరిశీలించి ఎస్సై కోటేశ్వరరావును వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎన్టీతండాకు వెళ్లి బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా కల్పించారు. సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.