హుస్నాబాద్‌టౌన్, డిసెంబర్ 29: పట్టణ ప్రజలకు అవసరమైనన్ని దరఖాస్తు ఫారాలను అందివ్వడానికి సిద్ధంగా ఉన్నామని సిద్దిపేట అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి చెప్పారు. హుస్నాబాద్ పట్టణంలోని 2, 10వ వార్డుల్లో ప్రజాపాలన నిర్వహించే కేంద్రాలను శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా దరఖాస్తుదారులతో మాట్లాడుతూ ఆరు గ్యారెంటీ పథకాల్లో ఏది అవసరమున్నా దరఖాస్తులో పొందుపర్చాలని సూచించారు. హుస్నాబాద్ పట్టణానికి ఏడువేలకుపైగా దరఖాస్తు ఫారాలు అందించామని, దరఖాస్తుల సంఖ్య పెరిగే అవకాశముండడంతో మరో ఇరువైవేలకుపైగా ఫారాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని అదనపు కలెక్టర్ పేర్కొన్నారు. స్థానికంగా నివాసం ఉన్నవారికి వ్యవసాయ భూమి ఎక్కడ ఉన్నా నమోదు చేసుకోవచ్చని, పాస్ బుక్నంబర్లు తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. కిరాయి ఇండ్లల్లో ఉన్నవారు సైతం గృహజ్యోతి విషయాన్ని నమోదు చేసుకునేందుకు అభ్యంతరం ఏమీలేదని చెప్పారు.
జనవరి 6 వరకు దరఖాస్తులు కేంద్రాలుంటాయని, మిగిలిపోయిన వారు మున్సిపల్ కార్యాలయం, తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయంలో అందించవచ్చని తెలిపారు. డబుల్బెడ్రూం ఇండ్లలో నివసించే వారికి కరెంట్ మీటర్లు ఇవ్వలేదని పలువురు వివరించగా, తక్షణమే విద్యుత్ మీటర్లను బిగించాలని విద్యుత్‌శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు ఎటువంటి సమస్యలపై దరఖాస్తులు ఇచ్చినా తీసుకోవాలని, ఇంటికి దరఖాస్తులు తప్పనిసరిగా ఇవ్వాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం నుంచి విధివిధానాలు ఇంకా ఖరారు కావాల్సి ఉందని అదనపు కలెక్టర్ స్పష్టం చేశారు. ఇందులో మున్సిపల్‌చైర్‌పర్సన్ ఆకుల రజితవెంకన్న, వైస్‌చైర్‌పర్సన్ అయిలేని అనిత, సింగిల్‌విండోచైర్మన్ బొలిశెట్టి శివయ్య, కమిషనర్ ఎంఆర్.రాజశేఖర్, కౌన్సిలర్లు బోజు రమాదేవి, గోవిందు రవీ, వల్లపు రాజు, మ్యాదరబోయిన శ్రీనివాస్, ఇన్చార్జి మేనేజర్ కృష్ణ, మెప్మా కో-ఆర్డినేటర్ రాజు, మాజీ సర్పంచ్ మడప జైపాల్‌రెడ్డి తదితరులున్నారు.