గజ్వేల్, నవంబర్ 27: గంజాయి విక్రయిస్తున్న నిందితులను పట్టుకొని అరెస్టు చేసినట్లు సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఏసీపీ పురుషోత్తంరెడ్డి తెలిపారు. బుధవారం సాయంత్రం సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్‌లోని ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. సిద్దిపేట టాస్క్‌ఫోర్స్, గజ్వేల్ పోలీసుల నిఘా ఉంచి చాకచక్యంగా గంజాయి అమ్ముతున్న నిందితులను పట్టుకొని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.
గజ్వేల్ మండలంలోని అహ్మదీపూర్ గ్రామానికి చెందిన అరికెల శేఖర్, బోయిని నరేశ్, కొండపాక మండలం సిరిసినగండ్లకు చెందిన సుక్కసారి భానుప్రసాద్ చెడు అలవాట్లకు బానిసగా మారి గంజాయి విక్ర యిస్తున్నట్లు తెలిపారు. గంజాయి తీసుకురావడానికి సీలేరుకు వెళ్తున్నట్లు వారం రోజుల క్రితం శేఖర్, నరేశ్ స్నేహితుడు భానుప్రసాద్‌కు ఫోన్ చేయగా నాకు కూడా గంజాయి కావాలని చెప్పి అతడు రూ.7వేలు వారికి ఫోన్ పే చేశాడన్నారు.
వారిద్దరూ సీలేరుకు వెళ్లి వర్ధన్ వద్ద రూ.30,800లకు 20కిలోల గంజాయి కొనుగోలు చేశారని, అందులో రెండు కిలోలు భానుప్రసాద్‌కు ఇచ్చాడ న్నారు. మల్లన్నసాగర్ కట్టపై ఉన్న వారి నుంచి 10 కిలోల గంజాయి, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకొని అరికెల శేఖర్, సుక్కసారి భానుప్రసాద్‌ను అదనపు సీఐ ముత్యంరాజు సిబ్బందితో పట్టుకొని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారన్నారు. పరారీలో ఉన్న నిందితులు బోయిని నరేశ్, సీలేరుకు చెందిన వర్ధన్‌ను త్వరలోనే పట్టుకుంటామన్నారు. టాస్క్‌ఫోర్స్ ఏసీపీ రవీందర్, ఇన్స్పెక్టర్లు జానకీరాంరెడ్డి, రమేశ్, సిబ్బంది గజ్వేల్ సీఐలు సైదా, ముత్యంరాజులను సిద్దిపేట సీపీ అనురాధ అభినందించినట్లు తెలిపారు.