ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం జరిగేలా పకడ్బందీగా దర్యాప్తు చేపట్టి పూర్తి ఆధారాలతో సకాలంలో చార్జిషీట్ దాఖలు చేయాలని సంగారెడ్డి ఎస్పీ రమణకుమార్ పోలీసు, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ వీరారెడ్డితో కలిసి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించి కేసుల పురోగతిపై సమీక్షించారు. కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ అండర్ ఇన్వెస్టిగేషన్ కేసుల దర్యాప్తు వేగవంతంపై ప్రత్యేక దృష్టి సారించాలని, బాధితులకు ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం త్వరితగతిన వచ్చేలా చూడాలన్నారు. ప్రతినెలా తప్పకుండా పౌర హక్కుల దినోత్సవం నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ సంస్థ చైర్మన్ సాయిచంద్ మృతికి సంతాపం తెలుపుతూ రెండు నిమిషాలు మౌనం పాటించారు.
సంగారెడ్డి కలెక్టరేట్, జూన్ 30: అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం జరిగేలా అధికారు లు సమన్వయంతో పని చేయాలని ఎస్పీ రమణకుమార్ ఆదేశించారు. శుక్రవారం షెడ్యూల్డ్ కు లాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ఎస్పీ, అదనపు కలెక్టర్ వీరారెడ్డి హాజరై, అట్రాసిటీ కేసుల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బాధితులకు న్యాయం చేసేందుకు వీలుగా పకడ్బందీగా దర్యాప్తు చేసి, పూర్తి ఆధారాలు సేకరించి సకాలంలో చార్జ్‌షీట్ ఫైల్ చేయాలన్నారు. అండర్ ఇన్వెస్టిగేషన్ కేసుల దర్యాప్తు వేగవంతమయ్యేలా ప్రత్యేకంగా దృష్టి సారించాలని డీఎస్పీలకు సూచించారు. కమిటీ సభ్యులు క్రియాశీలక పాత్ర పోషించాలన్నారు. క్షేత్ర స్థాయిలో అట్రాసిటీ అంశాలతో ముడిపడి ఉన్న ఘటనల గురించి ఎప్పటికప్పుడు తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రతి నెలా సివిల్ రైట్స్ డే నిర్వహించేలా చూడాలని ఆర్డీవోలకు సూచించారు.
అదనపు కలెక్టర్ వీరారెడ్డి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో లాంగ్ పెండింగ్ కేసులు ఏమీ లేవన్నారు. బాధితులకు న్యాయం జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మృతిచెందిన కేసుల్లో ముందుగా పరిహారం ఇచ్చేలా ప్రాధాన్యత చర్యలు తీసుకోవాలని సూచించారు. 2021-22లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించి 46 కేసుల్లో బాధితులకు రూ.59.84 లక్షలు మంజూరు చేసి చెల్లించినట్లు తెలిపారు. 2022-23కి సంబంధించిన 62 కేసులు సంబంధించి రూ.68 లక్షలు చెల్లించాల్సి ఉన్నదన్నారు. సమావేశంలో విజిలెన్స్ కమిటీ సభ్యు లు చెప్పిన సమస్యలపై దృష్టి సారించి విచారణ జరిపి పరిష్కరించాలని రెవెన్యూ, పోలీసు శాఖ అధికారులకు సూచించారు. ప్రతి నెలా 30న అన్ని గ్రామాల్లో పౌర హక్కుల దినోత్సవం నిర్వహించాలన్నారు. అంతకుముందు రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ సంస్థ చైర్మన్ సాయిచంద్ మృతికి సంతాపం తెలుపుతూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. సమావేశంలో జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ డీడీ అఖిలేశ్‌రెడ్డి, బీసీ సంక్షేమ అధికారి జగదీశ్, డీఎస్పీలు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రామాచారి, గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఫిరంగి, ఆర్డీవోలు, అధికారులు పాల్గొన్నారు.