వందశాతం ఆస్తిపన్ను వసూలే లక్ష్యంగా మెదక్ జిల్లా అధికారులు కసరత్తు చేస్తున్నారు. 469 పంచాయతీల్లో 99.10 శాతం వసూలు కాగా, మిగతా మొత్తాన్ని త్వరలోనే రాబడతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ.9 కోట్ల 12 లక్షల లక్ష్యం కాగా, రూ.9 కోట్ల 4లక్షల 27వేలు ప్రభుత్వ ఖజానాకు చేరాయి. సర్కార్ మంజూరు చేస్తున్న నిధులతో పాటు పన్నుల రూపంలో వచ్చిన డబ్బులతో జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుండగా, ప్రతి పల్లెలో మురుగు కాల్వలు, తాగునీటి వసతి, మొక్కల పెంపకం, పంచాయతీకి నర్సరీ, డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలు లాంటి సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే పదకొండు మండలాల్లో వందశాతం వసూలవగా, అత్యధికంగా పాపన్నపేటలో 102శాతం పన్ను వచ్చింది. ఇంకా ట్యాక్స్ కట్టాల్సిన ప్రజలు వెంటనే చెల్లించి తమకు సహకరించాలని అధికారులు సూచిస్తున్నారు.
మెదక్, ఏప్రిల్ 20: గ్రామ పంచాయతీల అభివృద్ధికి అవసరమైన నిధులు ప్రభుత్వాలు పుష్కలంగా అందజేస్తున్నాయి. దీంతో గ్రామ పంచాయతీల రూపురేఖలు మారతున్నాయి. ప్రగతి పనులతో పాటు పారిశుధ్యం విషయంలోనూ మెరుగుపడుతున్నాయి. అయితే, పల్లెలను మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రజల సహకారం కూడా ఉండాల్సిన అవసరం ఉన్నది. దీనికోసం జిల్లా పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీల్లో వంద శాతం పన్నులు వసూలు చేసేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు. ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులతో పాటు పన్నుల రూపంలో వచ్చిన నిధులను కూడా వినియోగించుకుంటే గ్రామాలు అభివృద్ధిలో మరింత ముందుకెళ్లనున్నాయి.
జిల్లాలోని 469 గ్రామ పంచాయతీల్లో టార్గెట్ రూ.9కోట్ల 12 లక్షలు కాగా, అధికారులు రూ.9 కోట్ల 4లక్షల 27వేలను వసూలు చేశారు. ఇంకా రూ.8లక్షలు వసూలు చేయాల్సి ఉంది. కాగా, జిల్లాలో పన్ను వసూళ్లలో పాపన్నపేట మండలంలో 102 శాతం పన్ను వసూలు చేసుకుని ముందుండగా, అల్లాదుర్గం, చేగుంట, చిలిపిచేడ్, హవేళీఘణాపూర్, కౌడిపల్లి, కొల్చారం, నర్సాపూర్, నార్సింగి, నిజాంపేట, రామాయంపేట, రేగోడ్ మండలాలు వంద శాతం పన్ను వసూలు పూర్తి చేశాయి.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం గ్రామాల రూపురేఖలు మారుతున్నాయి. ముఖ్యంగా పల్లె ప్రగతి కార్యక్రమంతో పల్లెల్లోని సమస్యలు పరిష్కారమవుతున్నాయి. మెదక్ జిల్లాలో 469 గ్రామ పంచాయతీలున్నాయి. గ్రామాలు మరింత అభివృద్ధి చెందాలంటే వంద శాతం పన్నులు వసూలే లక్ష్యంగా అధికారులు ముందుకెళ్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే జిల్లా అధికారులు ఇప్పటికే కిందిస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పల్లె ప్రగతి కార్యక్రమం తర్వాత ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి నిధులు కేటాయిస్తున్నది. మురుగు కాల్వల శుభ్రం, తాగునీటి వసతి, మొక్కల పెంపకం, ప్రతి పంచాయతీకి నర్సరీ, డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలు వంటి నిర్మాణాలు చేపట్టారు. వీటితో పాటు గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతీ గ్రామానికి ఒక ట్రాక్టర్‌ను కొనుగోలు చేయించి చెత్తను సేకరిస్తున్నారు. త్వరలోనే వంద శాతం పన్నులు వసూలు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు.
మెదక్ జిల్లాలో 469 గ్రామాల్లో 99.10 శాతం పన్నులు వసూలు చేశాం. జిల్లాలో రూ.9.12 కోట్లు లక్ష్యం కాగా, రూ.9.4 కోట్లువసూలు చేశాం. జిల్లాలో పన్ను వసూళ్లలో అల్లాదుర్గం, చేగుంట, చిలిపిచేడ్, హవేళీఘణాపూర్, కౌడిపల్లి, కొల్చారం, నర్సాపూర్, నార్సింగి, నిజాంపేట, రామాయంపేట, రేగోడ్ మండలాలు వంద శాతం పన్ను వసూలు పూర్తి చేశాయి. త్వరలోనే లక్ష్యాన్ని చేరుకుని జిల్లాను వంద శాతం పన్నుల వసూలులో నెంబర్ వన్‌గా నిలబెడతాం.
– సీహెచ్ తరుణ్‌కుమార్, డీపీవో మెదక్