సంగారెడ్డి కలెక్టరేట్, జూలై 8: సంగారెడ్డిలో ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేయాలని మంజీరా స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు మాణయ్య, విఠల్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. సోమవారం కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజావాణికి సంగారెడ్డి జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన అర్జీదారులు తమ ఫిర్యాధులను అందజేసి సమస్యలు పరిష్కరించాలని కోరారు. మంజీరా స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేస్తూ సంగారెడ్డిలో ఇండోర్ స్టేడియం, 400మీటర్ల రన్నింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని కోరారు. పట్టణంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయికి వెళ్లిన క్రీడాకారులు ఉన్నారని, గతంలో ఉన్న స్పోర్ట్స్ అకాడమీలు క్రమంగా ఇక్కడి నుంచి తరలిపోయాయని వివరించారు. ప్రజావాణిలో మొత్తం 79 అర్జీలు అందాయి.
ఇందులో రెవెన్యూ శాఖ నుంచి 29 అర్జీలు రాగా, ఆరోగ్య శాఖ 11, విద్యాశాఖ 8, సంక్షేమ శాఖ 6, పంచాయతీ రాజ్ 12, డీఆర్డీవో నుంచి 13 అర్జీలు వచ్చాయి. ఆయా దరఖాస్తులను అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురీలతో కలిసి స్వీకరించిన కలెక్టర్ వాటి ని సకాలంలో పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో అందిన అర్జీలను పెం డింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి, ఆయా సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, డీఆర్వో పద్మజారాణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 80 మేరకు జిల్లాస్థాయి బదిలీలు ఈనెల 20లోగా పూర్తి చేయాలన్నారు. జిల్లాలో సర్వీసు పూర్తి చేసుకున్న రాష్ట్రస్థాయి అధికారుల వివరాలు, జిల్లాస్థాయి సిబ్బంది వివరాలు, ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా సమర్పించాలన్నారు.