సిద్దిపేట, జూన్ 24: ఉపకార వేతనాలు చెల్లించి, సమస్యలు పరిషరించాలంటూ సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల ఎదుట జూనియర్ డాక్టర్లు సోమవారం సమ్మె చేశారు. అత్యవసర సేవలు మినహా అన్ని సేవలను బంద్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా సిద్దిపేట జూనియర్ డాక్టర్ల సంఘం అధ్యక్షులు ప్రత్యుశ్, పల్లవి మాట్లాడుతూ.. ప్రభుత్వం జూనియర్ డాక్టర్లకు రావాల్సిన ఉపకార వేతనాలను క్రమం తప్పకుం డా ఇవ్వాలని, రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఉపకార వేతనాలు సమయానికి రాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. హైదరాబాద్లో అత్యవసర సేవలందించే ఉస్మానియా దవాఖానకి నూతన భవనం నిర్మించాలన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో చికిత్స కోసం వచ్చే వారికి కనీస సౌకర్యాలు, వసతులు, మందులు సమయానికి అందించాలని డిమాండ్ చేశారు. సౌకర్యాలు లేక కొన్ని సమయాల్లో సరిగా చికిత్స అందకపోవడం వల్ల పేషంట్ల బంధువులు జూనియర్ డాక్టర్లపై దాడులకు దిగుతున్న ఘటనలు ఉన్నాయన్నారు. డాక్టర్లకు ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో విద్యనభ్యసిస్తున్న వారికి లైబ్రరీలు, హాస్టల్ వసతి, తాగునీరు, డాక్టర్ గదులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.