Edupayala | పాపన్నపేట, ఫిబ్రవరి22 : ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచిన ఏడుపాయల క్షేత్రానికి ఏఈవోగా అంజయ్యను నియమించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏడుపాయల క్షేత్రానికి నాణ్యమైన సేవలు అందిస్తాడంటూ అవినీతి మరకలు ఉన్న అధికారిని నియమించడం ఏంటని విమర్శలకు దారితీస్తోంది.
తెలంగాణలోని ఏడుపాయల వనదుర్గభవానీ మాత ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. ఈ ఆలయానికి ఏఈవోగా అంజయ్యను నియమిస్తూ ఈ నెల 19వ తేదీన ఉత్తర్వులు జారీ అయ్యాయి. అంజయ్య రెండు సంవత్సరాల పాటు ఆలయ ఏఈవో పదవిలో కొనసాగుతారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రతి నెల 25వేల వేతనం అందుతుందని చెప్పారు. ఈ ఉత్తర్వుల మేరకు శనివారం నాడు అంజయ్య విధుల్లో కూడా చేరారు. అయితే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని ఏడుపాయల ఏఈవోగా నియమించడం తీవ్ర వివాదాస్పదంగా మారింది.
అంజయ్యపై గతంలో పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరుగా (ఏఈవోగా ) పని చేసిన అంజయ్య.. ఈ సంవత్సరం జనవరి 31వ తేదీన పదవి విరమణ పొందారు. అంతకుముందు ఆయన కొమురవెళ్లి మల్లన్న ఆలయంలో సూపరింటెండెంట్‌గా పని చేశారు. మల్లన్న ఆలయ సూపరింటెండెంట్‌గా పనిచేసే సమయంలో పదోన్నతి కోసం అంజయ్య నకిలీ డిగ్రీ సర్టిఫికెట్‌ను సమర్పించారనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే ధర్మశాల నిర్మాణం కోసం సేకరించిన నిధులను సైతం దుర్వినియోగం చేశారనే ప్రచారం జరిగింది. దీనిపై 2017లోనే అంజయ్యపై కేసు నమోదైంది. ఈ కేసు ఇంకా విచారణలో ఉంది. ఇలాంటి వ్యక్తిని ఏడుపాయల ఆలయ ఏఈవోగా నియమించాలని సంబంధిత అధికారులపై ఆలయ ఈవో ఒత్తిడి తీసుకొచ్చినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం.