బల్దియా అభివృద్ధికి రూ.25 కోట్లు కేటాయించిన సీఎం కేసీఆర్
అందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్
అందోల్, ఫిబ్రవరి 26: అందోల్ చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేసి ప్రజలకు ఆహ్లాదకర వాతావరణాన్ని అందిస్తామని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. శనివారం క్యాంప్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్, కమిషనర్‌తో అందోల్- జోగిపేట మున్సిపాలిటీల అభివృద్ధిపై సమీక్షించారు. అనంతరం పార్టీ శ్రేణులు, అధికారులతో కలిసి అందోల్ చెరువు ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీ అభివృద్ధికి సీఎం కేసీఆర్ రూ. 25 కోట్లు మంజూరు చేశారన్నారు. ఆ నిధులతో అన్ని వార్డుల్లో అవసరమైన పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. అందోల్ చెరువు కట్టపై ఓపెన్ జిమ్ ఏర్పాటుచేశామని, అవసరమైతే అదనంగా మరిన్ని పరికరాలు సమకూర్చుతామని అన్నారు. అనంతరం అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ జర్నలిస్టు కిష్టయ్య ను ఎమ్మెల్యే పరామర్శించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, కమిషనర్ అశ్రిత్‌కుమార్, వైస్ ఎంపీపీ రామాగౌడ్, మాజీ ఎంపీపీ రామాగౌడ్, సర్పంచ్ ప్రవీణ్‌రెడ్డి, రవీంద్రగౌడ్ పాల్గొన్నారు.
మునిపల్లిలో..
మునిపల్లి, ఫిబవరి 26: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు పేదలకు వరంలా మారుతున్నాయని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు.శనివారం మునిపల్లిలో ఎస్వీఎస్ ఫంక్షన్ హాల్లో డబుల్ బెడ్రూం ఇండ్ల లక్కీడ్రా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కృషితో రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. మునిపల్లి గ్రామంలో ప్రభుత్వం నిర్మిస్తున్న 72 ఇండ్లకు 69 మంది లబ్ధిదారులను లక్కీ డ్రాలో పారదర్శకంగా కేటాయించినట్లు తెలిపారు. మండలంలోని కంకోల్ గ్రామంలో 96 డబుల్ బెడ్రూం ఇండ్లకు లబ్ధిదారులను ఎంపిక చేసి, ఇంటి నంబర్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. మునిపల్లి, కంకోల్ గ్రామాల్లో కేటాయించిన డబుల్ బెడ్రూం ఇండ్లను త్వరలోనే రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించనున్నారన్నారు.
గ్రామాల అభివృద్ధే సీఎం లక్ష్యం..
ప్రతీ పల్లె అభివృద్ధి చెందాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారని ఎమ్మెల్యే తెలిపారు. సీఎం ఇచ్చిన హామీ మేరకు సంగారెడ్డి జిల్లాలోని ప్రతి గ్రామానికి రూ.20 లక్షల నిధులు మంజూరు చేయ డం హర్షించదగ్గ విషయమన్నారు. సీఎం కేసీఆర్ హయాంలోనే పల్లెలు అభివృద్ధిలో పరుగులు పెడుతున్నాయన్నారు. కార్యక్రమంలో సంగారెడ్డి ఆర్డీవో నాగేశ్, ఎంపీపీ శైలజా శివశంకర్, జడ్పీటీసీ మీనాక్షి సాయికుమార్, పార్టీ అధ్యక్షుడు వారణాసి సతీశ్, రాష్ట్ర నాయకులు సాయికుమార్, శివశంకర్, సర్పంచ్ రమేశ్, యువత విభాగం అధ్యక్షుడు ఆనంద్‌రావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మల్లేశం, చెన్నవీరయ్యస్వామి, గ్రామ అధ్యక్షుడు నర్సింహులు పాల్గొన్నారు.