పటాన్చెరు రూరల్, జూన్ 13 : సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని అంతర్జాతీయ విత్తన పరిశోధన సంస్థ ఇక్రిసాట్‌ను శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ సందర్శించారు. ఇక్రిసాట్ ప్రధాన కార్యాలయం ఆవరణలోని ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్‌లో తన కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్‌ను జాయిన్ చేసేందుకు వచ్చారు.
పాఠశాలను స్వయంగా పరిశీలించి ఉపాధ్యాయులతో మాట్లాడారు. పవన్ కల్యాణ్ తన కుమారుడికి స్కూల్లో అడ్మిషన్ ఇప్పించినట్లు సమాచారం. మార్క్ శంకర్ పవనోవిచ్ ఇటీవల సింగపూర్‌లో తాను చదువుతున్న స్కూల్లో అగ్నిప్రమాదంలో గాయపడి కోలుకున్న సంగతి తెలిసిందే. పిల్లవాడి భద్రత, నాణ్యమైన విద్యపై అన్ని రకాలుగా ఆలోచించి ఇక్రిసాట్లోని స్కూల్‌ను ఆయన ఎంపిక చేసుకున్నట్టుగా తెలిసింది. ఇక్రిసాట్లోని స్కూల్ అంతర్జాతీయ ప్రమాణాలతో, చక్కటి పర్యావరణంలో ఉంటుంది.