జహీరాబాద్, అక్టోబర్ 19: ప్రజలకు పండ్లు, పూలు, కాయగూరలు, ఆకుకూరలు, చిరుధాన్యాలు, చికెన్, మటన్ ఒకేచోట లభించేలా బీఆర్ఎస్ ప్రభుత్వం వెజ్ అండ్ నాన్‌వెజ్ మా ర్కెట్లు నిర్మించిన సంగతి తెలిసిందే. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని ప్రధాన రహదారిపై ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్‌ను రూ.11కోట్లతో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మా ణం చేపట్టింది. గ్రౌండ్ ఫ్లోర్లో 33, మొదటి అంతస్తులో 34 కలిపి 67 దుకాణాలను నిర్మించింది. 2022, డిసెంబర్ 27న అప్పటి మం త్రి, ప్రస్తుత ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు, అప్పటి ఎంపీ బీబీపాటిల్, ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు కలిసి ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్ భవనాలను ప్రారంభించారు. కానీ, కాంట్రాక్టర్‌కు బిల్లులు రాక వాటిని అప్పగించలేదు. దీంతో అవి నిరుపయోగం గా మారాయి. కాంగ్రెస్ ప్ర భుత్వం వచ్చి రెం డేండ్లు కావస్తున్నా మా ర్కెట్ గురించి పట్టించుకోవడం లేదు. దీంతో రైతులు, వ్యాపారులకు తిప్పలు తప్పడం లేదు. రోడ్లపై దుకాణాలు ఏర్పాటు చేసుకొని వ్యాపారాలు కొనసాగిస్తున్నారు.
వ్యాపారుల ఎదురుచూపులు
ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్లో నిర్మించిన 53 దుకాణాలకు 2023 ఫిబ్రవరి 8న అధికారులు వేలం పాట నిర్వహించి వ్యాపారులను ఎంపిక చేశారు. కానీ, మార్కెట్ దుకాణాలకు సంబంధించిన బిల్లులు రాలేదని కాంట్రాక్టర్ వాటిని అప్పగించలేదు. దీంతో మార్కెట్ భవనాల కేటాయింపు ప్రక్రియ నిలిచిపోయింది. రెండేండ్లకు పైగానే వేలం పాట ద్వారా దక్కించుకున్న దుకాణాలను అప్పగించాలని మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా కమిషనర్, సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
డిపాజిట్ కింద రూ. 50 వేలు, సాల్వెన్సి సర్టిఫికెట్ ద్వారా రూ. 2 లక్షలు చెల్లించామని వ్యాపారులు తెలిపారు. ఫలితంగా రోజురోజుకు వడ్డీభారం పెరిగిపోతున్నదని వ్యాపారులు తెలిపారు. పలుమార్లు ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్ భవనాల గురించి సంబంధిత జిల్లా అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకుం డా పోయిందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2024 ఫిబ్రవరిలో జహీరాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ దృష్టికి ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్ భవనాల గురించి వ్యాపారులు తీసుకెళ్లారు. వెంటనే మార్కెట్ దుకాణాలను అప్పగించాలని వ్యాపారులు మొరపెట్టుకున్నారు. దీంతో సంబంధిత కాంట్రాక్టర్‌కు బిల్లులను ఇప్పిస్తామని చెప్పి, మార్కెట్ భవనాలను సంబంధించిన తాళాలను కలెక్టర్‌కు అప్పగించారు.
మార్కెట్ దుకాణాలను అప్పగించి సమస్యను పరిష్కరించాలని కలెక్టర్‌కు మంత్రి ఆదేశించారు. కానీ, నేటికి ఇదిగో.. అదిగో అంటూ రెండేండ్లకు పైగానే అధికారులు సమస్యను పరిష్కరించకుండా కాలం వెళ్ల్లదీస్తున్నారు. కొందరు వ్యాపారులు దుకాణాలను అప్పగించకపోవడంతో మార్కెట్ ఎదురుగా తాత్కాలిక దుకాణాలను ఏర్పాటు చేసుకుని విక్రయాలు చేపడుతున్నారు. ప్రధాన రహదారి కాబట్టి ఆర్థికంగా కలిసి వస్తుందని వేలంలో దక్కించుకుంటే నిరాశే మిగిలిందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూరగాయల దుకాణాలు రోడ్ల పక్కన నిర్వహిస్తుండడంతో పట్టణంలో ట్రాఫిక్ సమస్య ఏర్పడి ప్రజలు, వాహనచోదకులు ఇబ్బందులకు గురవుతున్నారు.అద్దెరూపంలో మున్సిపల్ శాఖకు నెలకు రూ. 6 లక్షలకు పైగానే ఆదాయాన్ని కోల్పోతున్నది. ఇప్పటికైనా అధికారులు దుకాణాలు అప్పగించేందుకు చర్యలు తీసుకోవాలని వ్యాపారులు కోరుతున్నారు.