30మంది విద్యార్థులకు వాతలు
గజ్వేల్, జనవరి 9: సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని దుద్దెడ సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో గురువారం దారుణం చోటుచేసుకుంది. తెల్లవారుజామున స్టడీ అవర్‌కు ఆలస్యంగా వచ్చారని ఫిజికల్ డైరెక్టర్ (పీడీ) 30మంది విద్యార్థులను వరుస క్రమంలో నిలబెట్టి కర్రతో చితకబాదాడు. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులకు తీవ్రంగా గాయాలవడంతో గుట్టుచప్పుడు కాకుండా సిద్దిపేట దవాఖానకు తరలించి చికిత్స చేయించారు. వివరాలు.. దుద్దెడ సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో ప్రతిరోజు విద్యార్థులను వాచ్మెన్ ఉదయం 5గంటలకు నిద్రలేవాల్సి ఉండగా, గురువారం ఆలస్యంగా 5.40 గంటలకు లేపారు. దీంతో పాటు చలి తీవ్రంగా ఉండడంతో స్టడీ అవర్‌కు పది నిమిషాలు విద్యార్థులు ఆలస్యంగా వెళ్లారు. ఎందుకు ఆలస్యం అయ్యిదంటూ విద్యార్థులపై పీడీ వాసు ఆగ్రహం వ్యక్తం చేసి కర్రతో చితకబాదాడు.
దీంతో పలువురికి వాతలు అయ్యాయి. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఇష్టం వచ్చినట్లు కర్రతో చితకబాదడంతో దెబ్బల తీవ్రతకు కొందరి నడుము కింది భాగంలో వాతలు వచ్చాయి. మరికొందరు విద్యార్థుల కాళ్లు, చేతులకు గాయాలవడంతో ఇబ్బంది పడ్డారు. గాయపడిన ఇద్దరు విద్యార్థులు వారి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా సిద్దిపేటలోని ప్రభుత్వ దవాఖానకు తరలించి చికిత్స చేయించారు. పాఠశాలకు వచ్చిన తరువాత విద్యార్థులకు కూర్చోవడం ఇబ్బందికరంగా ఉండడంతో వెంటనే తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. దీంతో తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకొని వారి పిల్లల శరీరంపై ఉన్న గాయాలను చూసి చలించిపోయారు. గతంలో కూడా పీడీ వాసు విద్యార్థులను ఇలాగే చితకబాదితే తల్లిదండ్రులు గురుకులాల ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. రెండోసారి జరిగిన సంఘటనతో గురుకుల పాఠశాల ఉపాధ్యాయులపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్రంగా మండిపడ్డారు.
ఫిజికల్ డైరెక్టర్ మాకొద్దు..
గజ్వేల్/కొండపాక, జనవరి 9: కొండపాక మండలంలోని దుద్దెడ సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలను జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ, జడ్జి స్వాతిరెడ్డి గురువారం సందర్శించి విద్యార్థులను ఫిజికల్ డైరెక్టర్ చితకబాదిన ఘటనపై విచారణ చేపట్టారు. ఉదయం స్టడీ అవర్‌కు అరగంట ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను తీవ్రంగా కొట్టడంతో గాయాలై దవాఖానలో చికిత్స పొందుతున్న విషయం తెలిసి గురుకుల పాఠశాలను సందర్శించారు. పీడీ విద్యార్థులను కొట్టడానికి గల కారణాలను తెలుసుకొని పాఠశాల పరిసర ప్రాంతాలను పరిశీలించి ఉపాధ్యాయులతో మాట్లాడారు. విద్యార్థులు ఫిజికల్ డైరెక్టర్ వాసు మాకొద్దంటూ రాతపూర్వకంగా రాసిచ్చారు. గురుకుల పాఠశాలలోని స్నానాల గదులు, మూత్రశాలల నుంచి దుర్వాసన రావడంతో కలెక్టర్‌కు పూర్తి సమాచారం అందిస్తామని తెలిపారు. పీడీ వాసు బుధవారం విద్యార్థులను కర్రతో కొట్టడంతో బొబ్బలు వచ్చాయి. దీంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో విషయం బయటకొచ్చింది.
భయంకర వాతావరణంలో గురుకులాలు
కొండపాక(కుకునూరుపల్లి), జనవరి 9: కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలతో భయంకరమైన వాతావరణంలో గురుకుల పాఠశాలలు కొనసాగుతున్నాయని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. గురువారం కొండపాక గురుకుల పాఠశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాల పీడీ వాసు విద్యార్థులకు ఆటలు, క్రమశిక్షణ నేర్పించాల్సింది పోయి స్టడీ అవర్స్‌కు అలస్యంగా వచ్చారని వాతలు వచ్చేలా విద్యార్థులను చితకబాదడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కలెక్టర్ స్పందించి విద్యార్థులను పైశాచికంగా చితకబాదిన పీడీ వాసుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయాలన్నారు. గురుకుల పాఠశాలలో పేద విద్యార్థులు తెలంగాణ నలుమూలల నుంచి వచ్చి చదువుతున్నారని, వారిని ప్రేమతో, ఆప్యాయంగా పలుకరించి సరైన పద్ధ్దతిలో నచ్చజెప్పి భావిపౌరులుగా తీర్చిదిద్దాల్సింది పోయి, సోయిలేకుండా చితక బాధడంపై ఆవేదన వ్యక్తం చేశారు.
తను విద్యార్థులతో మాట్లాడుతుంటే వారు భయభ్రాంతులకు గురవుతున్నారన్నారు. వారిలో అభద్రతాభావం కనిపిస్తోందని వంటేరు ప్రతాప్‌రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి గురుకుల పాఠశాలల విద్యార్థులకు స్వేచ్ఛ లేకుండా పోయిందన్నారు. తరుచూ ఫుడ్ పాయిజన్, పాముకాటు, ఇష్యూలు జరుగుతున్నాయని ఆరోపించారు. విద్యార్థులను కలిసేందుకు వారి తల్లిదండ్రులు వస్తే కలవనీయక పోవడం దారుణమని, ఇది రేవంత్‌రెడ్డి సర్కార్‌కు సిగ్గుచేటన్నారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో గురుకులాలు స్వేచ్ఛగా నడిచిన విషయాన్ని గుర్తుచేశారు.
ఇటీవల అసెంబ్లీలో సైతం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ వంటి ఘటనలు కాకుండా చూడాలని, స్నేహపూర్వకమైన వాతావరణంలో విద్యను అందించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయిన విషయాన్ని గుర్తుచేశారు. గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని చదువుతున్నారని, వారికి తగిన వసతులతో కూడిన విద్యను అందజేయాలన్నారు. గురుకులాల్లో నెలకొన్న సమస్యలపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని ప్రభుత్వాన్ని వంటేరు ప్రతాప్‌రెడ్డి హెచ్చరించారు. ఆయన వెంట బీఆర్ఎస్ కొండపాక మండల అధ్యక్షుడు నూనె కుమార్‌యాదవ్, మాజీ జడ్పీటీసీ రాణీసత్యనారాయణ గౌడ్ ఉన్నారు.