సంగారెడ్డి, ఆగస్టు 2(నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) విస్తరణకు వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా మొదట ఔటర్ రింగ్‌రోడ్డు సమీప పంచాయతీలను మున్సిపాలిటీల్లో విలీనం చేస్తోంది. సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు, అమీన్పూర్ మండలాల్లోని 11 పంచాయతీలు మున్సిపాలిటీల్లో విలీనం కానున్నాయి.
విలీన పంచాయతీలను డీనోటీఫై చేస్తూ త్వరలో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. అధికారుల సమాచారం మేరకు శనివారం ఉత్తర్వులు వెలువడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం జీహెచ్ఎంసీని ఔటర్ వరకు విస్తరించాలని నిర్ణయం తీసుకుని మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. జీహెచ్ఎంసీ విస్తరణ కోసం మొదటగా ఔటర్ సమీపంలోని గ్రామాల విలీన ప్రక్రియను ప్రారంభించింది. సంగారెడ్డి జిల్లాలో ఔటర్ సమీపంలోని 11 పంచాయతీలను సమీపంలోని రెండు మున్సిపాలిటీల్లో విలీనం చేస్తున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం ఔటర్‌రింగ్ రోడ్డు లోపల ఉన్న మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో కలిపి కొత్త డివిజన్లను ఏర్పాటు చేయనున్నది.
ఔటర్ రింగ్‌రోడ్డు సమీపంలోని 11 పంచాయతీలు రెండు మున్సిపాలిటీల్లో విలీనం కానున్నాయి. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను జిల్లా యంత్రాంగం ఇది వరకే ప్రభుత్వానికి పంపింది. ప్రతిపాదిత విలీన పంచాయతీలకు సంబంధించిన జనాభా, ఓటర్లు, విస్తీర్ణం, పరిశ్రమలు తదితర వివరాలను అధికారులు ప్రభుత్వానికి పంపారు. పంచాయతీల పాలకవర్గాల పదవీకాలం ఇటీవల ముగిసింది. దీంతో ప్రస్తుతం ప్రత్యేక అధికారుల పాలనలో పంచాయతీలు ఉన్నాయి.
పంచాయతీల విలీనానికి ఇదే సరైన సమయం అని భావించిన ప్రభుత్వం భావిస్తున్నది. పంచాయతీల పాలకవర్గాలు ఉంటే విలీనాన్ని వ్యతిరేకించే అవకాశాలు ఎక్కువగా ఉండేవి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక అధికారుల పాలనలో విలీన ప్రక్రియకు తెరతీసింది. పటాన్చెరు మండలంలోని పోచారం, ముత్తంగి, కర్థనూరు, పాటి, ఘనపూర్ పంచాయతీలు తెల్లాపూర్ మున్సిపాలిటీలో విలీనం కానున్నాయి. అమీన్పూర్ మండలంలోని ఐలాపూర్, ఐలాపూర్ తండా, పటేల్‌గూడ, దాయార, సుల్తాన్పూర్ పంచాయతీలను అమీన్పూర్ మున్సిపాలిటీలో విలీనం చేయనున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
పంచాయతీలను విలీనం చేయడంతో పన్నుల భారం పెరగడం, అనుమతులు పొందడం అంత సులభంగా ఉండదని, ప్రజాసేవలు సక్రమంగా అందవని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రజాప్రతినిధులు సైతం ప్రభుత్వం తీరును వ్యతిరేకిస్తున్నారు. పంచాయతీలను రద్దు చేయడంతో ప్రజలపై పన్నుల భారం పెరుగుతుందంటున్నారు. అభివృద్ధి కుంటుపడి ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు స్థానిక నాయకులు రాజకీయంగా పదవులు కోల్పోవాల్సి వస్తుందని చెబుతున్నారు.
ప్రభుత్వం ఔటర్ వరకు జీహెచ్ఎంసీ విస్తరించాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో సంగారెడ్డి జిల్లాలో జీహెచ్ఎంసీ డివిజన్ల సంఖ్య మరి న్ని పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో పటాన్చెరు, భారతినగర్, ఆర్సీపురం డివిజన్లు ఉన్నాయి. కాగా, ప్రభుత్వం తెల్లాపూర్, అమీన్పూర్ మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేసే అవకాశం ఉంది. ఇదే జరిగితే కొత్తగా రెండు నుంచి మూడు డివిజన్లు ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయి.