అమీన్పూర్, అక్టోబర్ 18: అమీన్పూర్ను మున్సిపాలిటీగా ఏర్పాటు చేసి రూ.200 కోట్లతో అభివృద్ధి చేసినట్లు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి తెలిపారు. బుధవారం అమీన్పూర్ మున్సిపాలిటీలోని కేఎస్సార్ కాలనీలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారాన్ని ఎమ్మెల్యే నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పరిపాలన వికేంద్రీకరణతో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించాలన్న సమున్నత లక్ష్యంతో సీఎం కేసీఆర్ అమీన్పూర్ పంచాయతీని మున్సిపాలిటీగా రూపొందించారన్నారు. అనంతరం ప్రతి కాలనీలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేశామని, అర్హులైన ప్రతిఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు.
ప్రతిఒక్కరికీ నాణ్యమైన వైద్యం ఉచితంగా అందించాలనే లక్ష్యంతో మూడు బస్తీ దవాఖానలు ఏర్పాటు, ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం సైతం మంజూరు చేయించినట్లు తెలిపారు. బిందెడు నీటి కోసం రోజుల తరబడి వేచి చూసే పరిస్థితుల నుంచి ప్రతి రోజు రక్షిత మంచినీరు అందిస్తున్న ఘనత బీఆర్ఎస్కే దక్కిందన్నారు. మున్సిపల్ పరిధిలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నాలుగేళ్ల కాలంలో 10 మిలియన్ లీటర్ల సామర్థ్యంతో ఐదు భారీ రిజర్వాయర్లు నిర్మించి మెరుగైన మంచినీటి సౌకర్యాన్ని కల్పిస్తున్నామన్నారు. అనంతరం బీరంగూడ గోశాలలో ప్రత్యేక పూజలు చేశారు.
విగ్రహ ప్రతిష్ఠాపనలో..
అమీన్పూర్ మండలం పటేల్‌గూడ గ్రామంలోని బీఎస్ఆర్ కాలనీలో నూతనంగా నిర్మించిన శివాలయం, హనుమాన్, వినాయక దేవాలయాల్లో ఏర్పాటు చేసిన విగ్రహ ప్రతిష్ఠాపనల కార్యక్రమానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ ప్రజలు ఘన స్వాగతం పలికి ఆత్మీయ సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ ఎంపీపీ దేవానంద్, జడ్పీటీసీ సుధాకర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, ఆయా వార్డుల కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.