సిద్దిపేట, జనవరి 7 : కేసీఆర్ కప్ సీజన్ -3 విజేతగా అంబేద్కర్ ఆజాద్ జట్టు నిలిచింది. ఆదివారం సిద్దిపేటలోని ఆచార్య జయశంకర్ స్టేడియంలో మిట్టపల్లి వర్సెస్ అంబేద్కర్ ఆజాద్ జట్ల మధ్య జరిగిన పోరులో మిట్టపల్లి పై అంబేద్కర్ ఆజాద్ జట్టు విజయం సాధించింది. ఫైనల్ మ్యాచ్‌కు ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు టాస్ వేసి మ్యాచ్‌ను ప్రారంభించారు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన అంబేద్కర్ ఆజాద్ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసింది. అంబేద్కర్ ఆజాద్ జట్టులో మహ్మద్ అర్ఫాజ్ 44 పరుగులతో రాణించారు. అనంతరం 129 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన మిట్టపల్లి జట్టు 10 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 62 పరుగులు చేసింది.
బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించిన మహ్మద్ అర్ఫాజ్ ఒక వికెట్ తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ సిద్దిపేట క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటాలనే లక్ష్యంతో సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు స్టేడియాన్ని తీర్చిదిద్దారన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో టోర్నమెంట్ ఆర్గనైజర్స్ మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, సిద్దిపేట క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి మల్లికార్జున్, నాయకులు ప్రవీణ్‌రెడ్డి, సద్ది నాగరాజురెడ్డి, అక్తర్‌పటేల్, రియాజ్ పాల్గొన్నారు.