సంగారెడ్డి కలెక్టరేట్, జనవరి 9: జిల్లాలో పరిశ్రమలకు అనుమతులు ఇచ్చేముందు సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలనలు జరపాలని సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో టీజీ ఐపాస్‌పై ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పరిశ్రమలోని కార్మికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. కార్మికుల శ్రేయస్సు, ప్రమాదాల నివారణ కోసం ప్రత్యేక తనిఖీలు చేపట్టాలన్నారు. ప్రతినెలా సమావేశానికి ముందు చెక్ లిస్ట్ సమర్పించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ తుల్జా నాయక్, ఆర్డీవో రవీందర్ రెడ్డి, జిల్లా సాంఘీక సంక్షేమ శాఖ అధికారి అఖిలేష్‌రెడ్డి పాల్గొన్నారు.
సాగుకు యోగ్యం కాని భూముల్లో పవర్ ప్లాంట్లు..
జిల్లాలోని వ్యవసాయానికి యోగ్యం కాని భూముల్లో పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్టు సంగారెడ్డి కలెక్టర్ వల్లూరి క్రాంతి తెలిపారు. మహిళా సంఘాల సభ్యులచే సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు కోసం గురువారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో సంబంధిత శాఖల అధికారులు, మహిళా సంఘాలతో కలెక్టర్ సమావేశమయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 50 గ్రామ సంఘాల ద్వారా 150 ఎకరాల్లో మొదటి విడతగా సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు నిర్ణయించినట్లు తెలిపారు. విద్యుదుత్పత్తి చేసే ప్లాంట్‌కు చాలా డిమాండ్ ఉన్నదన్నారు. 150 ఎకరాల భూమి కోసం వినియోగంలో లేని, ప్రభుత్వ, ప్రైవేటు భూములు, దేవాదాయ, ఆటవీ శాఖ భూములు, సొంత భూములను గుర్తించాలన్నారు. ఈనెల 18నాటికి పూర్తి వివరాలు పంపించాలన్నారు.
గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు చేయాలి..
గణతంత్ర వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని యంత్రాంగాన్ని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ముఖ్య అతిథులుగా రాజకీయ ప్రముఖులు, పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, సంఘ సేవకులను ఆహ్వానించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రతిశాఖ తమ బాధ్యతగా సమయానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, డీఆర్వో పద్మజా రాణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.