జిన్నారం, డిసెంబర్ 27: మండలంలోని గడ్డపోతారం పంచాయతీలోని సర్వేనంబర్ 27 ఉన్న 9 ఎకరాల ప్రభుత్వ భూమిని టీఎస్ఐఐసీకి కేటాయిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. బుధవారం ఈ భూమిని టీఎస్ఐఐసీకి కేటాయించేందుకు తహసీల్దార్ రవికుమార్, టీఎస్ఐఐసీ మేనేజర్ అండ్ కమిషనర్ సూరజ్ అల్లీనగర్ గ్రామ శివారులోని సర్వేనంబర్ 27కు పోలీస్ బలగాలతో కలిసి చేరుకున్నారు. 2016లో ఈ భూమి కోసం హైకోర్టును ఆశ్రయించిన రైతులు, ఇప్పటికీ ఆ భూముల్లో పంటలు వేస్తున్నామని, ఇవి తమ భూములని అధికారులను అడ్డుకున్నారు. తహసీల్దార్ రవికుమార్ మాట్లాడుతూ సర్వేనంబర్ 27లో గతంలో 39 ఎకరాల్లో పంటలకు బదులు ఇటుక బట్టీలు పెట్టుకోవాలని ఈ భూమిని అసైన్డ్దారులకు అధికారులు కేటాయించారని, 2009లోనే 20 ఎకరాలు లావణి పట్టాను రద్దు చేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నదని తెలిపారు. ఇందులోంచి 9 ఎకరాలను 2016లో టీఎస్ఐఐసీకి కేటాయించగా రైతులు హైకోర్టును ఆశ్రయించారని, ఏడేండ్ల తరువాత హైకోర్టు టీఎస్ఐఐసీకి కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చిందని గడ్డపోతారం, అల్లీనగర్ రైతులు, ప్రజలకు తహసీల్దార్ తెలిపారు.
భూములకు సంబంధించిన కాగితాలు, సర్టిఫికెట్లు ఉంటే తీసుకురావాలని, కోర్టును కూడా ఆశ్రయించవచ్చన్నారు. తహసీల్దార్ చెప్పిన వివరణకు సంతృప్తి చెందని రైతులు ఆందోళనకు దిగారు. పోలీసులు నచ్చజెప్పినా వినలేదు. దీంతో పోలీసుల పహారాలో టీఎస్ఐఐసీకి కేటాయించిన 9 ఎకరాల భూమిని జేసీబీలు, ట్రాక్టర్లతో చదునుచేశారు. కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని రైతులకు పటాన్చెరు ఇన్చార్జి డీఎస్పీ బాలాజీ తెలిపారు. తమ భూముల్లో చదును చేయొద్దని ఆందోళనకు దిగిన పదిహేను మంది రైతులు, నాయకులను పోలీసులు అరెస్టు చేసి బొల్లారం పోలీస్ స్టేషన్కు తరలించారు. కొద్ది సేపటి తరువాత వదిలేశారు. ఘటనా స్థలానికి సర్పంచ్ ప్రకాశ్చారి, ఉప సర్పంచ్ మమత పెంటేశ్, మాజీ సర్పంచ్లు అశోక్, నీరుడి శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ బాశెట్టి రాజు, వార్డు సభ్యులు, రైతులు, గ్రామస్తులు భారీగా చేరుకున్నారు. రాత్రి వరకు చదును పనులు జరిగాయి.