మెదక్, అక్టోబర్ 27(నమస్తే తెలంగాణ): మద్యం దుకాణాల లైసెన్స్‌ల జారీ కోసం సోమవారం మెదక్ బోధన్రోడ్డులోని వెంకటేశ్వర గార్డెన్లో లాటరీ పద్ధ్దతిలో వైన్‌షాపుల కేటాయింపునకు లక్కీ డ్రా నిర్వహించారు. మెదక్ కలెక్టర్ రాహుల్‌రాజ్ నేతృత్వంలో కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఎలాంటి అవాంతరాలకు తావులేకుండా సాఫీగా ఈ ప్రక్రియ కొనసాగింది.నూతన ఎక్సైజ్ పాలసీ నియమనిబంధనలు అనుసరిస్తూ ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా పక్కాగా ఏర్పాట్లు చేశారు. మెదక్ జిల్లాలోని 49 మద్యం షాపులకు మొత్తం 1420 దరఖాస్తులు దాఖలయ్యాయి. ఒక్కో షాపు వారీగా దాఖలైన దరఖాస్తులకు సంబంధించిన వారిని ఆహ్వానిస్తూ వారి సమక్షంలో కలెక్టర్ లక్కీ డ్రా తీస్తూ మద్యం దుకాణాలు కేటాయించారు. లక్కీ డ్రా కోసం వినియోగించిన టోకెన్లు అందరికీ చూపిస్తూ పారదర్శకంగా డ్రా నిర్వహించారు.
ఎలాంటి అనుమానాలకు ఆస్కారం లేకుండా లక్కీ డ్రా ప్రక్రియ ప్రారంభం నుంచి చివరి వరకు ఫొటో,వీడియో చిత్రీకరణ జరిపించారు. పెద్ద సంఖ్యలో దరఖాస్తుదారులు హాజరు కావడంతో టోకెన్ కలిగి ఉన్న వారినే లోనికి అనుమతించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా అదనపు ఎస్పీ మహేందర్,డీఎస్పీ ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు పర్యవేక్షించి,అధికారులకు పలు సూచనలు చేశారు. లక్కీ డ్రాలో అదృష్టం వరించి వైన్‌షాపులు దక్కిం చుకున్న వారు నిబంధనలు అనుసరిస్తూ లైసెన్స్ ఫీజు రూపేణా నిర్ణీత రుసుం చెల్లించేందుకు వీలుగా వేదిక వద్దనే అవసరమైన ఏర్పా ట్లు చేశారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్‌రెడ్డి ఇతర అధికారుల పర్యవేక్షణలో మద్యం దుకాణాల కేటాయింపు లక్కీ డ్రా ప్రశా ంతంగా కొనసాగింది.
ఈ సందర్భంగా మెదక్ కలెక్టర్ రాహుల్‌రాజ్ మాట్లాడుతూ మెదక్ జిల్లాలో మొత్తం 49 మద్యం షాపులు ఉన్నాయని,పారదర్శకంగా ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ ద్వారా లక్కీ డ్రా తీసినట్లు తెలిపారు. ఇందులో రిజర్వేషన్ ప్రాతిపదికలో భాగంగా ఎస్టీ 1,ఎస్సీ 6,గౌడకులానికి సంబంధించి 9, మొత్తం 16 షాపులు కేటాయించామన్నారు. మిగతా 33 షాపులు ఆన్ రిజర్వ్ కింద కేటాయించడం జరిగిందన్నారు. ఇందులో 18 షాపులను మహిళలు లక్కీడ్రా ద్వారా గెలుచుకోగా, 31 షాపులను పురుషులు దక్కించుకున్నారు. డిసెంబర్ ఒకటో తేదీ నుంచి మద్యం షాపు లు కేటాయించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఎక్సైజ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
సంగారెడ్డి కలెక్టరేట్, అక్టోబర్ 27: సంగారెడ్డి జిల్లాలో 101 మద్యం దుకాణాలకు సంబంధించి లైసెన్స్‌ల కోసం 4,432 దరఖాస్తులు వచ్చాయి. సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య ఆధ్వర్యంలో సోమవారం స్థానిక జేఎస్ఆర్ గార్డెన్లో లాటరీ పద్ధ్దతిలో లక్కీ డ్రా నిర్వహించారు. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నూతన ఎక్సైజ్ పాలసీ నిబంధనలు అనుసరిస్తూ పారదర్శకంగా మద్యం దుకాణాలు కేటాయించినట్లు స్పష్టం చేశారు.
100 మద్యం దుకాణాలకు సంబంధించి ఒక్కో దుకాణం వారీగా దరఖాస్తుదారులను ఆహ్వానించి వారి సమక్షంలో లక్కీ డ్రా నిర్వహించామన్నారు. 100 దుకాణాల కేటాయింపు పూర్తయిందన్నారు. మరో దుకాణానికి సంబంధించి తక్కువ దరఖాస్తులు వచ్చిన నేపథ్యంలో ఎక్సైజ్‌శాఖ ఆదేశాల మేరకు రీ-నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. పెద్ద సం ఖ్యలో దరఖాస్తుదారులు హాజరయ్యారు. దీంతో కేవలం టోకెన్ కలిగిన వారిని మాత్రమే లోపలికి అనుమతించారు. లక్కీ డ్రా ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ హరికిషన్, సూపరింటెండెంట్ నవీన్‌చంద్ర, సిబ్బంది పాల్గొన్నారు.