హుస్నాబాద్, ఆగస్టు 4: రైతులకు ప్రభుత్వం అప్రకటిత కరెంట్ కోతలు విధిస్తూ అరిగోస పెడుతున్నదని అఖిలపక్షం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట బీఆర్ఎస్, బీఎస్పీ, బీజేపీ నాయకులు, రైతుల ఆధ్వర్యంలో కరెంట్ కోతలపై ఫ్లకార్డులు ప్రదర్శించి ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయా పార్టీల నాయకులు మాట్లాడుతూ అధికారంలోకి వస్తే రైతులకు 24గంటల నాణ్యమైన విద్యుత్ ఇస్తామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. 18గంటల కరెంట్ ఇస్తున్నామని చెబుతున్నా కనీసం 10గంటలు కూడా త్రీఫేజ్ ఇవ్వకుండా ప్రభుత్వం రైతుల వెన్ను విరుస్తున్నదని ఆరోపించారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా కరెంట్ ఇవ్వడం వల్ల రైతులు అయోమయానికి గురవుతున్నారని, లోవోల్టేజీ కారణంగా మోటర్లు కాలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతుల ప్రభుత్వం అని చెప్పుకునే రేవంత్‌రెడ్డి ఎన్ని గంటల కరెంట్ ఇస్తున్నాడో ప్రకటించాలని డిమాండ్ చేశారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో 24గంటల కరెంట్ ఇవ్వకుంటే మంత్రి పొన్నం ప్రభాకర్ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం ట్రాన్స్‌కో డీఈఈ కార్యాలయంలో అధికారికి వినతి పత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ బీలూనాయక్, బీఆర్ఎస్ నాయకులు అయిలేని మల్లికార్జున్‌రెడ్డి, బీఎస్పీ నియోజకవర్గ ఇన్చార్జి పచ్చిమట్ల రవీందర్‌గౌడ్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్‌బాబు, ఆయా పార్టీల నాయకులు చిత్తారి శ్రీనివాస్, మారెపల్లి సుధాకర్, బొజ్జ హరీశ్, విజయభాస్కర్, అనంతస్వామి, యాస శ్రీనివాస్, ఎం శ్రీనివాస్, తిరుపతినాయక్, ఇరుగు రమేశ్, రైతులు రాఘవరెడ్డి, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.