మెదక్ రూరల్/ నర్సాపూర్/ మనోహరాబాద్/ హవేళీఘనపూర్, డిసెంబర్ 21 : ప్రతి రైతు ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకానికి ఈ-కేవైసీని చేయించుకోవాలని నర్సాపూర్ ఏడీఏ సురేఖ అన్నారు. బుధవారం నర్సాపూర్‌లోని వ్యవసాయ కార్యాలయంలో రైతులకు ఈ కేవైసీ చేయించారు. ఈ సందర్భంగా ఏడీఏ సురేఖ మాట్లాడుతూ నర్సాపూర్ మండలంలో 3500 మంది రైతులు ఈ కేవైసీ చేయించుకోలేదన్నారు. కామన్ సర్వీస్, మీసేవ కేంద్రాలతోపాటు రైతు వేదికల్లో కౌంటర్లు ఏర్పాటు చేశామని, రైతులందరూ తమ ఫోన్ నెంబర్ ను ఆధార్‌కార్డుతో అనుసంధానం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏవో అనిల్‌కుమార్, ఏఈవోలు దుర్గాప్రసాద్, హరీశ్, తేజస్విని, కామన్ సర్వీస్ సెంటర్ ఆపరేటర్ లక్ష్మణ్ పాల్గొన్నారు.
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి అర్హులైన రైతులందరూ తప్పనిసరిగా ఈ-కేవైసీ చేసుకోవాలని మెదక్ ఏఈవో భార్గవి సూచించారు. మెదక్ మండలంలోని వెంకటపూర్ గ్రామంలో రైతుల వద్దకు వెళ్లి ఈ-కేవైసీపై అవగాహన కల్పించారు. పీఎం కిసాన్ పథకం లబ్ధిదారులు ఈ-కేవైసీ చేసుకోవాలని, లేకుంటే డబ్బులు జమ కా వని వివరించారు. మనోహరాబాద్ మండలం దండుపల్లిలో ఏఈవో నరేందర్‌గౌడ్ రైతుల ఇంటికీ వెళ్లి ఈ కేవైసీ చేశారు. కొత్తగా పట్టా పు స్తకాలు వచ్చిన రైతులు రైతుబంధుకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో నాయకులు వెంకటేశ్‌గౌడ్, శ్రీనివాస్‌గౌడ్, రమేశ్, వెంకటేశ్ ఉన్నారు. హవేళీఘనపూర్ మండలం ఫరీద్పూర్ క్లస్టర్‌లోని జక్కన్నపేటలో ఏఈవో విజృంభన రైతులతో ఈకేవైసీ చేయించారు. రైతులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.