మునిపల్లి, ఫిబ్రవరి 20: నాలుగు రోజుల క్రితం దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందిన పదో తరగతి విద్యార్థిని ఆలియా బేగం(15) కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండాలని అందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ డిమాండ్ చేశారు. అలాగే ఇస్మాయిల్ కుటుంబంలో చదువుకున్న వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పారు. గురువారం మండలంలోని అంతారం గ్రామంలో ఇస్మాయిల్ కుటుంబాన్ని క్రాంతికిరణ్ పరామర్శించారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మాట్లాడుతూ అంతారంలో ఇస్మాయిల్‌తో అదే గ్రామ వాసులు వీరారెడ్డి విజయరెడ్డి వచ్చి కావాలనే గొడవకు దిగారు. ఇస్మాయిల్‌ను బూతు మాటలు తిడుతూ కొడుతుండడం, కేకలు వినిపించాయి. దీంతో ఆయన కూతురు ఆలియాబేగం వచ్చి తమ నాన్నను కొట్టొద్దు అని వీరారెడ్డి, విజయరెడ్డిలను బతిమిలాడినా ప్రయోజనం లేకపోయింది. తండ్రిని కొట్టే దెబ్బలు కూతురుకు బలంగా తగలడంతో కుప్ప కూలిపోయింది. దెబ్బలు బలంగా తగలడంతో పక్క గ్రామమైన పెద్దచెల్మడలోని ఓ ఆర్ఎంపీ వైద్యుడి దగ్గరకూ తీసుకెళ్లి వైద్యం అందించారు.
ఆమె కోలుకోకపోవడంతోమరునాడు బుదేరాలోని ఓ దవాఖానలో, పరిస్థితిలో మార్పు లేకపోవడంతో సంగారెడ్డిలోని ప్రైవేట్ దవాఖానకు తరలించారు. సంగారెడ్డి ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతూ ఆమె ఈ నెల 16న మరణించింది. గ్రామాల్లో పోలీసుల పెట్రోలింగ్ సరిగ్గా లేనందువల్లే మండలంలో రెండు రోజుల్లో రెండు హత్యలు జరిగాయని క్రాంతి కిరణ్ చెప్పారు.
తీవ్ర గాయాల పాలైన ఆలియా బేగంను వెంటనే పెద్ద దవాఖానకు తరలిస్తే ఆమె ప్రాణాలతో బయటపడేదని క్రాంతి కిరణ్ చెప్పారు. 11న గాయాలపాలైన ఆలియా బేగం ఈ నెల 16న మరణించిన సంగతి తెలియకపోవడంతో మునిపల్లి పోలీసులు ఎంత గాఢ నిద్రలో అర్ధం అవుతుందన్నారు. ఎటువంటి గొడవలైనా ఘటన జరిగిన ఐదు రోజుల వరకూ తెలియనట్లు వ్యవహరించడం పోలీసుల నిర్లక్ష్యం అని వ్యాఖ్యానించారు. పోలీసుల పెట్రోలింగ్ లేనందు వల్లే ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయ న్నారు. పోలీసులు నిద్రమత్తు వీడి బయటకు రావాలన్నారు. తర్వాత ఇస్మాయిల్ కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు.