గజ్వేల్, మే 28: రోహిణికార్తె ప్రవేశంతో సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా రైతులు వానకాలం పంటల సాగుకు సన్నద్ధమవుతున్నారు. గత వారం కురిసిన భారీ వర్షంతో వ్యవసాయ భూములు తడిసి ముద్దయ్యాయి. ముందస్తుగా కురిసిన వర్షాలకు రైతులు అప్పుడే ఒకసారి దుక్కులు దున్ని విత్తనాలు విత్తేందుకు సిద్ధం చేశారు. రోహిణికార్తెలో వర్షాలు కురిసిన వెంటనే అనుకున్న సమయానికి విత్తనాలు వేసుకునేందుకు దుక్కులను సిద్ధం చేసుకుంటున్నారు.
ఆదివారం నుంచి రోహిణి కార్తె రాకతో వానకాలం సీజన్ ప్రారంభమైంది. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఈ సంవత్సరం సుమారు 5.50లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలను రైతులు సాగు చేస్తారని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. జిల్లా వ్యాప్తంగా 2.50 లక్షల మంది రైతులు ఉండగా వీరిలో చాలామంది రైతులు వర్షాలను ఆధారంగా చేసుకొని పంటలు సాగు చేస్తున్నారు. కొంత మంది రైతులు నీటి ఆధారిత పంట వరి సాగును ఎక్కువగా చేపడుతున్నారు.
నీటి వసతులున్న రైతులు ముందస్తుగా దీర్ఘకాలిక రకం వరి సాగు చేస్తారు. ఈ సారి జిల్లావ్యాప్తంగా సుమారు 3.50లక్షల ఎకరాల్లో వరిసాగు చేసేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. రోహిణికార్తె రాకతో రైతులు వరినార్లు పోసుకునేందుకు విత్తనాలను సిద్ధం చేసుకుంటున్నారు. 1.20లక్షల ఎకరాల్లో పత్తి, 30 వేల ఎకరాల్లో మొక్కజొన్న, 6 నుంచి ఏడువేల ఎకరాల్లో కందులు, మరో 40వేల ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి డిమాండ్‌కు తగిన విధంగా ఎరువులు రైతులకు అందుబాటులో ఉంచేలా వ్యవసాయాధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
పెరగనున్న సాగు భారం
రైతులపై సాగు భారం రోజురోజుకూ పెరుగుతున్నది. వానకాలం పంటల సాగుకు అప్పుడే రైతులు వేసవి దుక్కులను దున్ని సిద్ధం చేసుకున్నారు. రోహిణికార్తెలో విత్తనాలు వేసుకునేందుకు అనువైన కార్తె కావడంతో రైతులు మరోసారి దుక్కులు దున్ని విత్తనాలు విత్తేందుకు సిద్ధమవుతున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరగడంతో రైతులపై మరింత పెట్టుబడిభారం పడుతున్నది. గతంలో కాడెడ్లతో సాగు పనులు చేసేవారు. కానీ కాలానుగుణంగా ఎక్కడా అలాంటి పరిస్థితులు ఎక్కువగా కనిపించడం లేదు. ఎక్కువ శాతం రైతులు ట్రాక్టర్‌తో దున్నే పనులు చేపడుతున్నారు.
ఒక్కో గ్రామంలో 15 నుంచి 20 వరకు ట్రాక్టర్లు ఉండగా ఇంధనభారం అధికమవుతున్నది. ప్రస్తుతం కురిసిన వర్షాలతో వానకాలం సాగు పనులు ప్రారంభం కావడంతో ట్రాక్టర్ల యజమానులు బిజీ బిజీగా మారారు. ప్రస్తుతం ఎకరాకు రూ.25 వేల నుంచి రూ.30వేల వరకు అన్ని రకాల ఖర్చులు అవుతాయని రైతులు వాపోతున్నారు. గతంతో పోల్చితే ఈ సంవత్సరం ట్రాక్టర్ దున్నేందుకు ధరలు పెంచడంతో రైతులపై భారం పడుతున్నది. దీనికి తోడు కూలీల కొరత, ఇతర పెట్టుబడి ఖర్చుల వినియోగం విపరీతంగా పెరుగుతున్నది. ప్రతి సంవత్సరం రైతులపై సాగుభారం పడుతున్నది.