మెదక్ : రాష్ట్రవ్యాప్తంగా జూలై 1 నుంచి చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం మెదక్ జిల్లాలో అన్ని శాఖల సమన్వయంతో విజయవంతంగా కొనసాగుతోందని, బాల కార్మిక వ్యవస్థను సమూలంగా నిర్మూలించేందుకు ప్రతి శాఖ సమిష్టిగా కృషి చేయాలని మెదక్ జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన వివిధ శాఖల సమన్వయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని హోటళ్లు, ఇటుక బట్టీలు, నిర్మాణ పనులు, వ్యాపార సముదాయాలు తదితర ప్రాంతాల్లో పనిచేస్తున్న బాల కార్మికులను గుర్తించాలన్నారు. వారిని రక్షించి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC) ముందు హాజరుపరిచి అనంతరం తల్లిదండ్రులకు లేదా అవసరమైతే సంరక్షణ గృహాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
పిల్లల బాల్యం విద్యకే అంకితం కావాలని, వారి భవిష్యత్తు అభివృద్ధికి ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని, బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. చదువుకోవడానికి ఆర్థిక స్తోమత లేని పిల్లలను ప్రభుత్వ వసతి గృహాల్లో (హాస్టళ్లలో) చేర్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ విషయంలో జిల్లా ప్రజలు పోలీసు శాఖకు సహకరించాలని, ప్రతి బాలుడి బాల్యం పాఠశాలకే అంకితం కావాలని పిలుపునిచ్చారు.
ఇప్పటి వరకు జిల్లాలో 34 మంది చిన్నారులను రక్షించి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరుపరిచిన అనంతరం వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించి అప్పగించినట్లు తెలిపారు. అలాగే జిల్లా వ్యాప్తంగా 22 కేసులు నమోదు చేసినట్లు పేర్కొంటూ, బాల కార్మికులను పనిలో ఉంచుకునే యజమానులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ జార్జ్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ సతేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు.