మెదక్ : నేరాల నిర్మూలన, ప్రజల రక్షణ, భద్రతాభావం కల్పించడంలో భాగంగానే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నట్లు అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ తెలిపారు. ప్రజల్లో భద్రతాభావం పెంపొందించడం, నేరాల నియంత్రణ లక్ష్యంగా మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీనగర్‌లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 70 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. తనిఖీల సందర్భంగా సరైన పత్రాలు లేని 45 వాహనాలను తాత్కాలికంగా సీజ్ చేశారు. సంబంధిత వాహన యజమానులు అవసరమైన పత్రాలు సమర్పించి తమ వాహనాలను తీసుకెళ్లాలని సూచించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎవరైనా కొత్త వ్యక్తులు అద్దెకు ఇల్లు తీసుకోవడానికి వస్తే వారి పూర్తి వివరాలు సేకరించడంతో పాటు ఆధార్ కార్డు లేదా ఇతర గుర్తింపు పత్రాలను తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
ఈ సందర్భంగా డిజిటల్ అరెస్ట్, ఫోన్ కాల్ బ్లాక్మెయిల్, ఓటీపీ మోసాలు, పార్ట్‌టైమ్ జాబ్ ఫ్రాడ్స్, ఫేక్ లింకుల ద్వారా జరిగే సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనుమానాస్పద కాల్స్, సందేశాలకు స్పందించకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్, సీఐలు మహేష్, రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.