మెదక్, అక్టోబర్ 7(నమస్తే తెలంగాణ): ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించి, బాధితులకు న్యాయం చేయాలని మెదక్ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీవోసీ కా ర్యాలయంలో ప్రజావాణి నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ..దరఖాస్తులను పరిషరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రజలు నేరుగా సమస్యలను అధికారులకు చెప్పుకునే వేదికగా ప్రజావాణి ఉపయోగపడుతుందన్నారు. జిల్లాలోని ప్రజలకు మెరుగ్గా సేవలు అందించేందుకు అధికారులు కృషి చేయాలని సూ చించారు. 55 ఫిర్యాదులు వచ్చాయని, ఇందులో ధరణి 15, పింఛన్లు 1, పంట రుణమాఫీ 4, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు 6, ఇతర సమస్యలపై 29 దరఖాస్తులు వచ్చాయన్నారు. కార్యక్రమంలో డీఆర్డీవో శ్రీనివాసరావు, జడ్పీసీఈవో ఎల్లయ్య, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.