సంగారెడ్డి కలెక్టరేట్/ మెదక్ మున్సిపాలిటీ, జూన్ 28 : సంగారెడ్డి జిల్లాలో జూలై 1న జరగనున్న గ్రూప్-4 పరీక్ష ను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను అదనపు కలెక్టర్ వీరారెడ్డి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో గ్రూప్-4 పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై సం బంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భం గా వీరారెడ్డి మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ సూచించిన విధం గా ఏర్పాట్లు చేసి, పరీక్ష సజావుగా జరిగేలా పరీక్ష కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. జూలై 1న ఉద యం 10 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పేపర్ -1, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష ఉంటుందన్నారు. సంగారెడ్డి జిల్లాలో 101 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, 33,456 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నట్లు వివరించారు. టీఎస్పీఎస్సీ మార్గదర్శకాలను ప్రతి ఒక్కరూ పాటించాలని, లైజనింగ్ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లు పరీక్ష కేంద్రాలకు ముందస్తుగా సందర్శించి తాగునీరు, విద్యుత్, సీటింగ్, సీసీ కెమెరాల ఏర్పాటు తదితర వసతులను తనిఖీ చేయాలని సూచించారు. పరీక్ష రోజున పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లో జీరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లను మూసివేసి, 144 సెక్షన్ అమలు చేయాలన్నారు. పరీక్ష కేంద్రంలో వైద్య సదుపాయం అందుబాటులో ఉంచాలని, పోలీసు బందోబస్తు పకడ్బందీగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రంలోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలతోపాటు సెల్ ఫోన్లు, రైటింగ్ ప్యాడ్లు అనుమతించరని స్పష్టం చేశారు.
పరీక్ష సమయానికి కంటే 15 నిమిషాల ముందుగా పరీక్ష కేంద్రం గేట్ మూసివేయాలని అదనపు కలెక్టర్ సూచించా రు. జూలై 1న 8 నుంచి 9:45 గంటల వరకు, మధ్యాహ్నం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2:15 గంటల వరకు అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించాలన్నారు. పరీక్ష కేంద్రం గేటు మూసిన తరువాత ఎవరిని లోపలికి అనుమతించవద్దన్నారు. ఇన్విజిలేటర్లను లాటరీ ద్వారా అలాట్ చేయాలని, ఇన్విజిలేటర్ల నుంచి నో రిలేషన్ సర్టిఫికెట్ తీసుకోవాలని చీఫ్ సూపరింటెండెంట్లకు సూచించారు. దివ్యాంగులకు గ్రౌండ్ ఫ్లోర్లో సీటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. నామినల్ రోల్స్‌లో ఎక్కడైనా ప్రింటింగ్ రాకపోతే డౌన్లోడ్ చేసుకోవాలని, ఈ నెల 30న ఇన్విజిలేటర్లకు విధిగా శిక్షణ ఇవ్వాలన్నారు. పరీక్ష కేంద్రాలకు పోలీసుల ఆధ్వర్యంలో ప్రశ్నాపత్రాలను స్ట్రాంగ్‌రూం నుంచి నిబంధనల మేరకు తరలించాలని సూచించారు. సమీక్షలో డీఆర్వో నగేశ్, డిప్యూ టీ డీఈవో విజయ, అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంఈవోలు పాల్గొన్నారు.
పరీక్షకు హాజరుకానున్న 11,527 మంది
మెదక్ జిల్లాలో గ్రూప్-4 పరీక్షను సజావుగా నిర్వహించడానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ రాజర్షిషా ఆదేశించారు. కలెక్టరేట్లో ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, ఆదనపు కలెక్టర్లు ప్రతిమాసింగ్, రమేశ్, జిల్లా అధికారులతో సమీక్షించారు. జిల్లాలో 30 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, 11,257 మంది అభ్యర్థులు పరీక్ష రా యనున్నట్లు తెలిపారు. అభ్యర్థులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. జూలై 1న మొదటి సెషన్ ఉదయం 10 నుంచి 12:30 వరకు, రెండో సెషన్ 2:30 నుంచి 5 గంట ల వరకు జరుగుతుందన్నారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి ఉదయం 8 నుంచి 9:45 వరకు, మధ్యాహ్నం 2:15 వరకు మాత్రమే అనుమతిస్తామన్నారు. అభ్యర్థులు చెప్పులతో మాత్రమే పరీక్ష కేంద్రాలకు రావాలని, షూస్‌కు అనుమతి లేదన్నారు. ఎలక్ట్రానిక్ పరిక రాలకు తీసుకరావద్దని సూచించారు. అభ్యర్థులు హాల్‌టికెట్‌తోపాటు సరైన గుర్తింపు కార్డుతో పరీక్షకు హాజరు కావాలన్నారు. పరీక్షహాల్లో గైర్హాజరైన విద్యార్థుల సీట్లలో కేవలం ప్రశ్నాపత్రం మాత్రమే ఉంచాలన్నారు. రూట్ ఆఫీసర్లు, చీప్ సూపరింటెండెం ట్లు, అధికారులు సమన్వయం చేసుకోని పరీక్షలు సజావుగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, జిల్లా అధికారులు, మెదక్ డీఎస్పీ సైదులు పాల్గొన్నారు.