రామచంద్రాపురం, అక్టోబర్ 9: కాంగ్రెస్ సర్కార్ సామాన్య ప్రజలకు శాపంగా మారిందని బీఆర్ఎస్ పటాన్చెరు నియోజకవర్గ ఇన్చార్జి ఆదర్శ్‌రెడ్డి అన్నారు. ఆర్టీసీ చార్జీలు పెంపునకు నిరసనగా బీఆర్ఎస్ తలపెట్టిన ‘ఛలో బస్‌భవన్’ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు బీఆర్ఎస్ నేతలను ముందస్తు హౌస్ అరెస్టు చేశారు. ఆర్సీపురం డివిజన్లోని ఆర్‌ఆర్‌నగర్‌లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఆదర్శ్‌రెడ్డిని హౌస్ అరెస్టు చేయగా, తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీఆర్ఎస్ నేతలు సోమిరెడ్డి, లచ్చిరాం, బాబ్జీ, దేవేందర్‌యాదవ్, శ్రీకాంత్‌రెడ్డి, దయాకర్‌రెడ్డి, నాగరాజుని కొల్లూర్ పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఈ సందర్భంగా ఆదర్శ్‌రెడ్డి మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి ప్రజాపాలన అంటూనే ప్రజల నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై నిరసనలు, ధర్నాలు చేసుకోవచ్చని చెప్పిన ముఖ్యమంత్రే, ఇప్పుడు నిరసనలు, ధర్నాలను అణచి వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తూనే ఆర్టీసీ చార్జీలు పెంచి సామాన్యులపై గుదిబండ మోపుతున్నారని అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడం చేతకాని సీఎం ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. పెంచిన ఆర్టీసీ చార్జీలను వెంటనే విరమించుకోవాలని, లేనిపక్షంలో బీఆర్ఎస్ ఉద్యమాన్ని ఉధృతం చేస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మైపాల్యాదవ్, పరమేశ్, యూనుస్, దిలిప్సింగ్, నర్సింగ్‌రావు, శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.