దుబ్బాక, మే 31: మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తులపై విచక్షణారహితంగా దాడి చేసి, గాయపర్చిన నలుగురు యువకులపై దుబ్బాక పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను శుక్రవారం సాయంత్రం సిద్దిపేట జిల్లా దుబ్బాక సర్కిల్ కార్యాలయంలో సిద్దిపేట ఏసీపీ మధు తెలియజేశారు. దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేటకు చెందిన రశీద్, అతడి మిత్రుడు హైదరాబాద్కు చెందిన విష్ణుతో కలిసి గురువారం కారులో దుబ్బాకకు వస్తున్నారు. దుబ్బాక పట్టణంలో(దుబ్బాక-లచ్చపేట రోడ్డులో)ని గంగమ్మ ఆలయం సమీపంలో ఎదురుగా వస్తున్న మరో కారులో దుబ్బాకకు చెందిన దేవుని రమణ, పర్స భాస్కర్, రాచమల్లు వినోద్ అలియస్ బొమ్మ, ఆలేటి శరత్ వారి కారును అడ్డగించారు.
మద్యం మత్తులో ఉన్న నలుగురు యువకులు రశీద్, విష్ణులతో గొడవ పడ్డారు. అంతటితో అగకుండా వారిపై బీరు సీసాలతో విచక్షణ రహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. వారి కారును ధ్వంసం చేశారు. అటుగా వెళ్తున్న ప్రయాణికులు తీవ్ర గాయాలపాలైన రశీద్, విష్ణులను దుబ్బాకలోని వంద పడకల దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి సిద్దిపేట జిల్లా దవాఖానకు తరలించారు. ఈ విషయంపై రషీద్ భార్య నస్రీం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పాత కక్షలతోనే ఆ ఇద్దరు యువకులపై నిందితులైన నలుగురు యువకులు దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. వీరిపై 307 సెక్షన్ కిందా హత్యాయత్నం కేసు నమోదు చేసి, రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. సమావేశంలో దుబ్బాక సీఐ శ్రీనివాస్, ఎస్సై గంగారాజు, పోలీసులు హరిసింగ్, రాంజీ, ఆశోక్, గణేశ్ తదితరులున్నారు.