పటాన్చెరు, ఆగస్టు 8: ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతంగా గుర్తింపుపొందిన పటాన్‌చెరులోని పరిశ్రమల్లో ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. ఇక్కడ పారిశ్రామిక వాడల్లో వందలాది పరిశ్రమలు ఉన్నాయి. పటాన్చెరు, రామచంద్రాపురం, అమీన్పూర్ ప్రాంతాల్లో పెద్ద పెద్ద కంపెనీలు తమ షాపులు, షాపింగ్‌మాల్స్ ఏర్పాటు చేశాయి. పటాన్చెరు ఓఆర్ఆర్ చుట్టూ ప్రపంచ స్థాయి విద్యాసంస్థలు ఏర్పాటయ్యాయి. కానీ, వీటిలో సరైన భద్రతా వ్యవస్థలు లేవనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ఫ్యాక్టరీలు, గోదాముల్లో, షాపింగ్ మాల్స్‌లో భద్రత ప్రశ్నార్థ్ధకంగా మారింది.
బుధవారం సాయంత్రం గుమ్మడిదల మండలంలోని అన్నారం గ్రామ శివారుల్లోని గుబ్బ కోల్ట్ స్టోరేజ్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పటాన్చెరు, పాశమైలారం, బొల్లారం, ఖాజీపల్లి, గడ్డపోతారం ప్రాంతాల్లోని ఫ్యాక్టరీల్లో తరుచూ అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో కార్మికులు మృత్యువాత పడుతున్నారు. పాశమైలారం పారిశ్రామికవాడలో ఏప్రిల్ 17న వెంకర్ కెమికల్స్ పరిశ్రమలో అగ్నిప్రమాదం చోటుచేసుకోగా, భారీగా నష్టం జరిగింది. జూన్ 30న సిగాచి రసాయన పరిశ్రమల్లో ప్రమాదం జరిగి 46మంది కార్మికులు చనిపోయిన సంగతి తెలిసిందే.
జూలై 13న పాశమైలారం పారిశ్రామికవాడలోని ఎన్విరో వేస్ట్ మేనేజ్మెంట్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగి లారీ, జేసీబీ కాలిపోయా యి. యాజమాన్యాల నిర్లక్ష్యంతోనే ఎక్కువగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిసింది. అనుభవం లేని ఉద్యోగులతో పనులు చేయిస్తుండడంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఫ్యాక్టరీలోని బాయిలర్ల వద్ద నిపుణులు లేక ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నట్లు తెలిసింది.
ఫ్యాక్టరీలు, కోల్డ్ స్టోరేజ్‌లు, గోదాములు, షాపింగ్ మాల్స్‌లో అగ్ని ప్రమాదాల నివారణకు సరైన పరికరాలు ఏర్పాటు చేయకపోవడంతో ప్రమాదం జరిగినప్పుడు నష్టం ఎక్కువగా జరుగుతున్నట్లు తెలిసింది. అగ్ని ప్రమాదాలు జరిగిన సమయంలో అధికారులు ఫ్యాక్టరీలు , గోదాములు తనిఖీ చేస్తున్నారు, మిగతా సమయాల్లో తనిఖీలు చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఫైర్ సేప్టీ పరికరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నా యాజమాన్యాలు చర్యలు తీసుకోవడం లేదు. ఫైర్ ఎక్స్టింగ్విషర్లు అన్ని ప్రదేశాల్లో అందుబాటులో ఉంచాలి. ఫైర్ అలారం సిస్టమ్‌లు అమర్చుకోవాలి. హీట్ సెన్సార్లు, స్మోక్ డిటెక్టర్లు ఏర్పాటు చేసుకోవాలి. కోల్డ్ స్టోరేజ్‌ల్లో స్ప్రింక్లర్, వాటర్ స్ప్రే సిస్టిమ్ అమర్చాలి.
విద్యుత్ వ్యవస్థను పర్యవేక్షించాలి. ఓవర్లోడింగ్, షార్ట్ సర్క్యూట్ వంటి ప్రమాదాలకు కారణమయ్యే సమస్యలు నుంచి నివారణకు రెగ్యులర్ చెకింగ్ చేయాలి. ఐఎస్ఐ ప్రమాణాలకు అనుగుణంగా వైర్లను, స్వీచ్‌బోర్డులు ఏర్పాటు చేసుకోవాలి. రసాయన పదార్థాల నిర్వహణ, ఫ్యాక్టరీలో వాడే ఇంధనాలు, కెమికల్స్, వాయువులు వేర్వేరు గదుల్లో నిల్వ చేయాలి. కోల్డ్ స్టోరేజ్‌ల్లో అమోనియా గ్యాస్ లీకేజీ కాకుండా చర్యలు తీసుకోవాలి. ఎమర్జెనీ ఎగ్జిట్ ఏర్పాటు చేసుకోవాలి. ఉద్యోగులకు రెగ్యులర్‌గా ఫైర్ డ్రిల్‌పై శిక్షణ ఇప్పించాలి. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదాలపై చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఉద్యోగులు, సిబ్బందికి అగ్ని ప్రమాదాలు జరిగితే ఎలా ఎదుర్కోవాలో అవగాహన కల్పించక పోవడంతో ప్రమాదాల్లో క్షతగాత్రులు అవుతున్నారు, చనిపోతున్నారు. ఆస్తి నష్టం జరుగుతున్నది.
గుమ్మడిదల, ఆగస్టు 8: నిర్లక్ష్యం, భద్రతా లోపం పర్యావరణానికి ముప్పు తెచ్చింది. మంచి వాతావరణాన్ని కలుషితం చేసింది. పరిసర ప్రాంతాల ప్రజలకు రసాయన వాయువులు పీల్చేలా చేసింది. ఇప్పటి వరకు పరిశ్రమల్లో అగ్నిప్రమాదాలు జరుగుతాయని తెలిసిన ప్రజలకు, ఇప్పుడు కొత్తగా కోల్డ్ స్టోరేజీల్లో కూడా అగ్ని ప్రమాదాలు సంభవిస్తామని, కోల్డ్ స్టోరేజీల్లో అగ్ని ప్రమాదాలు సంభవించినా ఎంతగా నష్టం జరుగుతుందో తెలిసి వచ్చింది. రసాయన ఉత్పత్తులు, మందులు, వ్యాక్సిన్లు కోల్డ్ స్టోరేజీలో భద్రపరిస్తే, ఆ కోల్డ్ స్టోరేజీ యాజమాన్యం నిర్లక్ష్యంతో ప్రమాదం జరిగి కోట్లాది రూపాయల ఆస్తి నష్టం జరిగింది. ఇంత జరిగినా కోల్డ్ స్టోరేజీ యాజమాన్యం కిమ్మనడం లేదు.
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని అన్నారం గ్రామశివారులో గల గుబ్బకోల్డ్ స్టోరేజీలో బొంతపల్లి, బొల్లారం, గడ్డపోతారం తదితర ప్రాంతాలకు చెందిన రసాయన పరిశ్రమలకు చెందిన మందులు, ఉత్పత్తులు, వ్యాక్సిన్ల బాక్స్‌లు, రసాయన ముడి సరుకులు, 127 రకాల ఉత్పత్తులు భద్రపరుస్తారు. దీనికి పరిశ్రమలు అద్దె చెల్లిస్తున్నాయి. బుధవారం అగ్నిప్రమాదం సంభవించడంతో కోల్డ్ స్టోరేజీలో భద్రపరిచిన 127 రకాల ఉత్పత్తులు కాలిబూడిదయ్యాయి. దీంతో కోట్లాది రూపాయల నష్టం వాటిల్లినట్లు పోలీసులు, అగ్నిమాపక అధికారులు సూత్రపాయంగా తెలిపారు.
ఈ కోల్డ్‌స్టోరేజీలో సేఫ్టీ లేకపోవడంతోనే అగ్నిప్రమాదం సంభవించిందని ఆరోపణలు వస్తున్నాయి. ప్రమాదాలు జరుగుతాయని తెలిసి కూడా కోల్డ్ స్టోరేజీ యాజమాన్యం సేప్టీ పరికరాలు, ఫైర్‌ఫైటర్స్‌ను ఏర్పాటు చేయకపోవడం నిర్లక్ష్యాన్ని తెలియజేస్తున్నది. కోల్డ్ స్టోరేజీలో బుధవారం జరిగిన అగ్ని ప్రమాదంతో మూడు రోజులుగా దట్టమైన పొగ వెలువడుతున్నది. ప్రజలకు, పర్యావరణానికి ప్రమాదం ఉందని పోలీసులు కోల్డ్ స్టోరేజీ ముందు దారిని మూసివేసి రాకపోకలను బంద్ చేశారు. కోల్డ్ స్టోరేజీలో భద్రపరుస్తున్న రసాయన ఉత్పత్తులకు, కోల్డ్ స్ట్టోరేజీకి బీమా ఉందనే యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని స్థానికులు, పరిశ్రమల వర్గాలు డిమాండ్ చేస్తున్నారు.
పటాన్చెరు హైదరాబాద్‌కు సమీపంలో ఉండడంతో అధికంగా వ్యాపారులు షాపింగ్ మాల్స్, విద్యా సంస్థలను ఏర్పాటు చేశారు. ఇస్నాపూర్ నుంచి రామచంద్రాపురం వరకు షాపింగ్ మాల్స్ అధికంగా ఉన్నాయి. షాపింగ్ మాల్స్‌లో అగ్నిమాపక పరికరాలు ఉన్నా పనిచేయడం లేదని తెలిసింది. కొందరు నిర్వాహకులు అధికారులు వచ్చిన సమయంలో పరికరాలు ఏర్పాటు చేసి, తరువాత తీసివేస్తున్నారని తెలిసింది. షాపింగ్ మాల్స్‌లో పనిచేసే ఉద్యోగులకు ప్రమాదాలు అదుపు చేసేందుకు కనీస అవగాహన ఉండడం లేదు. దీంతో అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఆస్తి, ప్రాణ నష్టం అధికంగా జరుగుతున్నది. షాపింగ్ మాల్స్ నిర్వాహకులు అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చేందుకు ఎగ్జిట్ ఏర్పాటు చేయడం లేదు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడే అధికారులు వచ్చి హడావిడి చేసి వెళ్లిపోతున్నారు. ఆ తర్వాత రక్షణ చర్యలు తీసుకోక పోవడంతోనే ప్రమాదాలు ఆగడం లేదు.
కోల్డ్ స్టోరేజ్‌లో ఉపయోగించే రిఫ్రీజిరెంట్లు (అమోనియా ఫ్రియాన్) ప్రమాదకరం కాబట్టి జాగ్రత్త నిర్వహణ చేయాల్సి ఉంటుంది. అమోనియా ఫ్రియాన్ లీకేజీ జరిగితే గుర్తించే ప్రత్యేక పరికరాలు చాలాచోట్ల ఏర్పాటు చేయడం లేదని తెలిసింది. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కోల్డ్ స్టోరేజీ వెంటిలేషన్ ఉండేలా ఏర్పాట్లు చూసుకోవాలి. విద్యుత్తు వైర్లు సక్రమంగా లేకపోవడంతో షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఓవర్ లోడ్‌తో షార్ట్ సర్క్యూట్ సంభవించి అవకాశాలు ఉన్న దృష్ట్యా జాగ్రత్తలు తీసుకోవాలి. అమోనియ గ్యాస్ లీకేజీతో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. పైపులైన్లో పగుళ్లతో లీకేజీ జరిగితే స్పార్క్‌తో పేలుళ్లు సంభవిస్తున్నాయి.
ఫైర్ అలారం, డిటెక్షన్ వ్యవస్థ లోపాలు ఉండడంతో ప్రమాదాలు జరుగుతున్నా యాజమాన్యాలు నివారణ చర్యలు తీసుకోవడం లేదు. నిర్వహణలో నిర్లక్ష్యంతో పాటు ఫ్రీజింగ్ యూనిట్లను సమయానికి సర్వీసింగ్ చేయకపోవడంతో వాల్వులు, కనెక్టర్లు చెడిపోయినా పరికరాలు మార్చకపోవడంతో అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిసింది. అగ్నిమాపక శాఖ అధికారులు తనిఖీలు చేసి చర్యలు తీసుకోకపోవడంతోనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.