సంగారెడ్డి జనవరి 20(నమస్తే తెలంగాణ): పుణె నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ సరఫరా చేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్‌ను సంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ అధికారులు సోమవారం పట్టుకున్నారు. అతడి నుంచి రూ.21 లక్షల విలువ చేసే 120మిల్లీగ్రాముల ఎండీఎంఏ క్రిస్టల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. జమ్మూకశ్మీర్‌కు చెందిన హర్జత్సింగ్(35) హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. హర్జత్సింగ్ మొదట డ్రగ్స్‌ను అలవాటు చేసుకున్నాడు. వస్తున్న వేతనమంతా డ్రగ్స్‌కు ఖర్చు కావడంతో అదనపు అదాయం కోసం డ్రగ్స్‌ను అమ్మడం మొదలుపెట్టాడు. తొలుత సాఫ్ట్వేర్ కంపెనీలోని సహచరులకు, ఆ తర్వాత ఇతరులకు డ్రగ్స్ అమ్ముతూ వ్యాపారిగా మారాడు.
మహారాష్ట్రలోని పుణె నుంచి డ్రగ్స్ తీసుకువచ్చి హైదరాబాద్‌లో సరఫరా చేసేవాడు. పుణె నుంచి హైదరాబాద్‌కు కారులో డ్రగ్స్ తీసుకుని బయలుదేరాడు. సంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ అధికారులు సోమవారం పట్టణ సమీపంలోని మల్కాపూర్ ైఫైఓవర్ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. హర్జత్సింగ్ వాహనాన్ని తనిఖీ చేయడంతో డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించారు. హర్జత్సింగ్ తన వాహనంలో తరలిస్తున్న ఎండీఎంఏ డ్రగ్ క్రిస్టల్స్‌ను ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. దీని విలువ రూ. 21.06 లక్షలు ఉంటుందని, నిషేధిత ఎండీఎంఏ డ్రగ్స్ క్రిస్టల్స్‌ను రవాణా చేస్తున్న హర్జత్ సింగ్‌ను అరెస్టు చేసినట్లు ఎక్సైజ్‌శాఖ అసిస్టెంట్ సూపరింటెండెంట్ శ్రీనివాస్‌రావు తెలిపారు.
సాప్ట్వేర్ ఇంజినీర్‌గా సమాజంలో మంచి గుర్తింపు, అదాయం ఉన్నప్పటికీ హర్జత్సింగ్ డ్రగ్స్‌కు అలవాటు పడి అదనపు ఆదాయం కోసం డ్రగ్స్ వ్యాపారిగా మారినట్లు అసిస్టెంట్ సూపరింటెండెంట్ చెప్పారు. హర్జత్సింగ్ డ్రగ్స్ వ్యాపారంపై మరింత విచారణ జరుపుతున్నట్లు వివరించారు. పట్టుకున్న బృందంలో సీఐ చంద్రశేఖర్, ఎస్ఐలు యాదయ్య, హన్మంతు, శ్రీనివాస్‌రెడ్డి, కానిస్టేబుల్ ప్రభాకర్‌రెడ్డి ఉన్నట్లు చెప్పారు.