సంగారెడ్డి కలెక్టరేట్, జూన్ 24: అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులో పూర్తి చేసి జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కర్, సంగారెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, కొనింటి మాణిక్‌రావు సూచించారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశా) సమావేశం నిర్వహించారు. ఎంపీలు రఘునందన్‌రావు, సురేశ్‌షెట్కార్, జైపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, కలెక్టర్ ప్రతీక్ జైన్ తదితరులతో కలిసి కేంద్ర ప్రభుత్వ నిధులతో జిల్లాలో అమలవుతున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, మౌలిక వసతుల పురోగతిపై సమీక్షించారు. కేంద్ర, ప్రభుత్వ నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎంపీ ల్యాడ్స్ నిధులతో చేపడుతున్న పనుల్లో జాప్యాన్ని నివారించాలన్నారు. కోహీర్ మున్సిపాలిటీకి అవసరమైన తాగునీటి కనెక్షన్ల కోసం ప్రతిపాదనలను సిద్ధం చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
మెదక్ ఎంపీ రఘునందన్‌రావు మాట్లాడుతూ జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులను పారదర్శకంగా, సమర్ధవంతంగా వినియోగించాలన్నారు. జిల్లాలో ఈ సారి సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కానున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ముత్తంగి నుంచి సంగారెడ్డి చౌరస్తా వరకు జాతీయ రహదారి పనులు ఆలస్యం కావడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వాటిని వెంటనే పూర్తి చేయాలని సదరు అధికారులను ఆదేశించారు. పెద్దాపూర్ రోడ్డు పనులు పెండింగ్‌లో ఉన్నందున ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగారెడ్డి- పటాన్చెరు మార్గంలో రహదారి అభివృద్ధి పనులకు సీఆర్ఎఫ్ కింద ప్రతిపాదనలు పంపించాలని అధికారులకు సూచించారు.
సంగారెడ్డిలో జవహర్ నవోదయ విద్యాలయం ఏర్పాటు చేయాలని స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కలెక్టర్‌ను కోరారు. దిశా సమావేశంలో నవోదయ విద్యాలయం ఏర్పాటు చేయాలని కోరుతూ కలెక్టర్‌కు లేఖను అందించారు. ఈ సందర్భంగా ఎమెల్యే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 2024లో తెలంగాణకు మంజూరు చేసిన 7 కొత్త జవహర్ నవోదయ విద్యాలయాలలో ఒకటి సంగారెడ్డి జిల్లాకు కేటాయించారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. సంగారెడ్డి, కంది, కొండాపూర్ మండలాల్లో ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్నందున, 2026-27 విద్యా సంవత్సరంలోనే నవోదయ విద్యాలయం ప్రారంభించేందుకు అవసరమైన భూ కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్‌ను కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు సంగీత, పాండు, అన్ని శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ చైర్మన్లు, కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.