దౌల్తాబాద్, నవంబర్ 11: సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం గొడుగుపల్లి అటవీ ప్రాంతంలో మంగళవారం చిరుత మృతిచెందింది. జిల్లా అటవీశాఖ అధికారి శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకొని చిరుత కళేబరాన్ని పరిశీలించారు. చిరుత కళేబరానికి జిల్లా పశువైద్యాధికారి కొండల్‌రెడ్డి ఆధ్వర్యంలో శవ పరీక్షలు చేశారు. చిరుత మృతి చెందడం బాధాకరం అని, చిరుత శరీరానికి ఎలాంటి గాయా లు కాలేదని, దెబ్బలు తగలలేదని గోర్లు, దంతాలు అన్నీ బాగానే ఉన్నాయని జిల్లా అటవీశాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు. చిరుత ఊపిరితిత్తుల్లో నిమోనియా సోకి చనిపోయి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. చిరుత శరీర భాగాలను సీసీఎంబీ ల్యాబ్‌కు పంపించామని, ల్యాబ్ పరీక్షలు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.
చిరుత వయసు పదేండ్లు ఉంటుందని, ఇలాంటి అడవుల్లో ఇంత పెద్ద చిరుత ఉండ డం అరుదు అని చెప్పారు. చిరుతలు కనిపిస్తే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. చిరుత దాడిలో పశువులు, రైతు లు గాయపడినా, మృతిచెందినా పరిహారం ఇప్పిస్తామని, జిల్లాలో దాదాపు 20 కేసులు పరిషరించామని అధికారి తెలిపారు. కార్యక్రమంలో దుబ్బాక రేంజ్ అధికారి సందీప్ కుమార్, మండల పశు వైద్యాధికారి పరశురామ్, ఫారెస్ట్ అధికారులు హైమద్, వేణు, మల్లేశం, లింగమూర్తి, మల్లేశం పాల్గొన్నారు.