సిద్దిపేట, అక్టోబర్ 4 : పెద్దవైద్యం అనగానే మనకు వెంటనే గుర్తకు వచ్చేది హైదరాబాద్‌లోని కార్పొరేట్ దవాఖానలు. కార్పొరేట్‌ను తలదన్నేలా ప్రభుత్వం నిరుపేదలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి తీసుకువస్తుంది. సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని ప్రతి జిల్లాకో మెడికల్ కళాశాల ఏర్పాటుచేసి, దానికి అనుబంధంగా బోధన దవాఖానాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. సిద్దిపేటలోని మెడికల్ కాలేజీ ఆవరణంలో గల సర్వజనీన వైద్యశాల (బోధన దవాఖాన)ను గురు వారం ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రారంభించనున్నారు.
పేదలకు ప్రభుత్వ వైద్యంపై భరోసా కల్పించడమే లక్ష్యంగా మంత్రి హరీశ్‌రావు నిరంతరం కృషి చేస్తున్నారు. ప్రభుత్వం ఎన్సాన్పల్లి శివారులో మెడికల్ కళాశాల ఆవరణంలో 1000 పడకల దవాఖానను నిర్మించింది. రూ.236కోట్లతో జీ+5 విధానంలో నిర్మించగా, సిద్దిపేట జిల్లాతోపాటు చుట్టుపకల గ్రామాల ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఒకప్పుడు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్, కరీంనగర్‌కు వెళ్లిన ప్రజలకు నేడు సిద్దిపేటలోనే అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీంతో ప్రజలు హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు వెళ్లే బాధలు తప్పనున్నాయి. ఈ దవాఖాన ఏర్పాటుతో ప్రజలకు కిమోథెరపీ, రెడియోథెరపీ, క్యాత్ ల్యాబ్ అందుబాటులోకి రానుండగా, క్యాన్సర్, కిడ్నీ, గుండె వ్యాధుల ఉచితంగా వైద్యం అందించనున్నారు.
సిద్దిపేట మెడికల్ కళాశాల ఆవరణంలో 27.24ఎకరాల్లో రూ.236 కోట్లతో 7లక్షల 7వేల 332 చదరపు అడుగుల విస్తీర్ణంలో 1000 పడకలతో జీ+5 విధానంలో దవాఖానను నిర్మించారు. మెడికల్ కళాశాలలో 9 లిప్ట్‌లు, రెండు మెయిన్ కారిడారులు, రెండు ర్యాంపులు, 13మెట్ల మార్గాలతో పాటు మార్చురీ, బయోమెడికల్ వేస్ట్ యూనిట్, 12 ఆపరేషన్ థియేటర్లు, షాపిం గ్ కాంప్లెక్స్ ఆయా విభాగాల ఐసీయూలను ఏర్పాటు చేశారు.
పెద్ద దవాఖానలో అందించే సేవలు అన్నీ ఉచితంగా లభించనున్నాయి. ఇందులో అందించే సేవలు ల్యాప్రోసోపిక్ సర్జరీలు, జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్ (పిల్లల విభాగం), ప్రసూతి, గైనకాలజీ, ఆర్థోపెడిక్ (ఎముకల చికిత్స, రీప్లేస్ మెంట్), ఆప్తమాలజీ (కంటి చికిత్స, సర్జరీలు), ఈఎన్టీ (చెవి, ముకు, గొంతు), సైకియాట్రిక్ (మానసిక వైద్యం), డెర్మటాలజీ (చర్మవ్యాధుల నివారణ), రెస్పిరేటరీ మెడిసిన్ (శ్వాసకోశ చికిత్స), అనస్తీషియా (పాముకాటు, క్రిమిసంహారక మందు బాధితులకు చికిత్స) డెంటల్ (దంతాలకు అన్నిరకాల చికిత్స), రేడియాలజికల్ సేవలు (సిటీ సాన్, అల్ట్రాసౌండ్, టిఫా, ఎక్స్‌రేలు, మామోగ్రఫీ టెస్టులు), ల్యాబ్ (బయోకెమిస్ట్రీ, పాథాలజీ, మైక్రోబయాలజీ విభాగాలు), ఎమర్జెన్సీ, క్యాజువాలిటీ సేవలు, ఐసీయూ సేవలు, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు డయాలసిస్ సేవలు, నవజాత శిశు సంరక్షణ విభాగం, పాలియేటివ్ కేర్ సెంటర్, క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు కీమోథెరపీ సెంటర్, ఫిజియోథెరపీ, ఆరోగ్య మహిళా సేవలు, యాంటీ రెట్రోవైరల్ థెరపీ, డయాగ్నోస్టిక్ హబ్ (134 రకాల రక్త పరీక్షలు) చేయనున్నారు.
మనిషికి ఆరోగ్యం కంటే గొప్ప సంపద లేదు. సిద్దిపేట ప్రభుత్వ దవాఖానను ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రజలకు ఆర్థిక స్థోమత, సరైన వైద్యసేవలు అందుబాటులో లేకపోవడం హైదరాబాద్ లాంటి నగరా లకు వెళ్లి వ్యయ ప్రయాసాలకు గురైన సందర్భాలు ఎన్నో నా దృష్టికి వచ్చాయి. సిద్దిపేటలో అన్నిరకాల వైద్య సేవలు ఉచితంగా అందించాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ ఆశీస్సులతో మెడికల్ కళాశాల మంజూరు చేయించుకున్నాం. అన్నిరకాల చికిత్సలు స్పెషలిస్ట్ వైద్యులతో 1000 పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మించడం వైద్య మంత్రిగా నాకు గొప్ప సంతృప్తినిచ్చింది.
-తన్నీరు హరీశ్‌రావు, ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి