పటాన్చెరు, ఫిబ్రవరి 28: సైన్స్ ఎన్నో ఆవిష్కరణలకు బాటలు వేసి, మానవాళి జీవన ప్రమాణాల మెరుగుదలకు దోహద పడుతోందని, సైన్స్‌ను కెరీర్‌గా తీసుకోవాలని వర్ధమాన శాస్త్రవేత్తలు, విద్యార్థులకు జాన్స్ హాప్కిన్స్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లోని జెనిటిక్ మెడిసిన్ విభాగం ప్రొఫెసర్,నోబెల్ బహుమతి గ్రహీత డాక్టర్ గ్రేగ్ ఎల్ సెమెంజా పిలుపునిచ్చారు. హైదరాబాద్ గీతం వర్సిటీలో బుధవారం నిర్వహించిన జాతీయ సైన్స్ దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ‘భారతదేశ అభివృద్ధి కోసం దేశీయ పరిజ్ఞానం’ అనే ఇతివృత్తంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రేగ్ మాట్లాడుతూ.. తన పాఠశాల రోజులు, విద్యాబుద్ధులు నేర్పి ఎదిగేందుకు ఊతమిచ్చిన తన అధ్యాపకురాలు డాక్టర్ రోజస్ ఎస్.నెల్సన్‌ను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు.
అంతర్ విభాగ జ్ఞానాన్ని మార్పిడి చేసుకునే, సహకార వేదికలుగా తోడ్పడే సెల్ కల్చర్ ల్యాబ్, సెంట్రల్ ఇన్స్ట్రూమెంట్ ఫెసిలిటీ ల్యాబ్‌లను ఈ సందర్భంగా ప్రొఫెసర్ సెమెంజా ప్రారంభించారు. సుస్థిర భవిష్యత్తు కోసం హరిత కార్యక్రమంగా ఒక మొక్కను ఆయన నాటారు. ఈ తరువాత కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ అధ్యాపకులతో ముఖాముఖీ సంభాషించారు. భారత శాస్త్ర సాంకేతిక విభాగం కార్యదర్శి డాక్టర్ ఎస్.చంద్రశేఖర్ అతిథిని పరిచయం చేయడంతో పాటు జాతీయ సైన్స్ దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీఎస్‌రావు డాక్టర్ గ్రేగ్‌ను ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. వివిధ పాఠశాలల నుంచి 800 మంది విద్యార్థులు, గీతం అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.