దుబ్బాక, డిసెంబర్ 28 : దుబ్బాక మండలంలోని పోతారం గ్రామ నిరుపేదల సొంతింటి కల నెరవేరనున్నది. ఇప్పటి వరకు పురిగుడిసెలు, అద్దె ఇండ్లల్లో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన డబుల్ బెడ్రూం ఇండ్ల పథకం పేదలకు వరంగా మారింది. ఈ నెల 30న దుబ్బాకలో పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పోతారం గ్రామంలో మం త్రులు లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలతో పాటు డబుల్ బెడ్రూం ఇండ్లను అందజేయనన్నారు. మెదక్ ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్‌రెడ్డి స్వగ్రామం పోతారంలో పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు పంపిణీతో పాటు పలు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవంతో పాల్గొనేందుకు మంత్రులు రానున్నారు. డబుల్ బెడ్రూం ఇండ్లకు నల్లా కనెక్షన్, విద్యుత్ సరఫరా ఏర్పాటు చేశారు. కాలనీలో సీసీరోడ్లు నిర్మించారు. మంత్రు లు తన్నీరు హరీశ్‌రావు, పువ్వాడ అజయ్ కుమార్, వేముల ప్రశాంత్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులు గృహ ప్రవేశాలు చేయనున్నారు. గ్రామంలో 30 డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేయించారు. ఇండ్ల నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేయించి, నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు మెదక్ ఎంపీ ప్రత్యేక దృష్టి సారించారు. తమ స్వగ్రామంలో డబుల్ బెడ్రూం ఇండ్లతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు ఏర్పాట్లు జోరందుకున్నాయి. గ్రామంలో డబుల్ బెడ్రూం ఇండ్ల ఎదుట పందిళ్లు, విద్యుత్ దీపాల కాంతులతో జిగేల్ మనేలా కాలనీ రూపుదిద్దుకుంటుంది.
మెదక్ ఎంపీ స్వగ్రామం పోతారంలో ఈ నెల 30న రూ.6 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రులు ప్రారంభించనున్నారు. రూ.5.92 కోట్లతో పూర్తి చేసిన అభివృద్ధి పనులు, రూ.3.65 కోట్లతో 73 డబుల్ బెడ్రూం ఇండ్లు, రూ.1.20 కోట్లతో విద్యుత్ సబ్‌స్టేషన్, రూ.30 లక్షలతో రెడ్డి సంఘం భవనం, రూ.45 లక్షలతో గోదాం, రూ.20 లక్షలతో ప్రభు త్వ ప్రాథమిక పాఠశాలలో 4 అదనపు తరగతి గదులు, రూ. 12 లక్షలతో వైకుంఠధామం నిర్మించారు. వీటితో పాటు పంచాయతీ భవనానికి రూ.20లక్షలు మంజూరు కాగా, వీటిన్నింటినీ మంత్రులు, ఎంపీ ప్రభాకర్‌రెడ్డి ప్రారంభించనున్నారు.
ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి తన స్వగ్రామం పోతారంపై ఉన్న మమకారం ఎనలేనిది. గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పేదలకు అండగా ఉంటూ సహాయం అందిస్తూ మానవత్వం చాటుకున్నారు. గ్రామాభివృద్ధి కోసం తన సొంత డబ్బులు ఖర్చు చేశారు. సబ్‌స్టేషన్ కోసం కావాల్సిన ఎకరం స్థలం, తన సొంత డబ్బులు రూ.10 లక్షలు అందజేశారు. గోదాం భవనానికి మరో ఎకరం భూమి అవసరం ఉండగా, అందుకు రూ.6లక్షలు అందజేశారు. వైకుంఠధామానికి రూ.3లక్షలతో 10 గుంటల భూమిని కొనుగోలు చేసి పంచాయతీకి అందజేశారు.
ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ప్రత్యేక చొరవతో దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి జరిగింది. ఎంపీకి స్వగ్రామంపై ఉన్న మమకారం ఎనలేనది. గ్రామంలో ప్రజల కోరిక మేరకు కమ్యూనిటీ పరంగా కాలనీలు ఏర్పాటు చేసి డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించారు. అత్యధికంగా 73 ఇండ్లు నిర్మించడం సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్ సర్కారులో ఎంపీ ప్రభాకర్‌రెడ్డి ప్రత్యేక చొరవతో గ్రామంలోని పేదలకు సొంతిం టి కల నెరవేరింది. ఎంపీ సొంత డబ్బులతో పలు అభివృద్ధి పనులకు స్థలాన్ని కొనుగోలు చేసి ఇవ్వడం గ్రామ ప్రజల అదృష్టంగా భావిస్తున్నాను.
-కొత్త పుష్పలతాకిషన్రెడ్డి, ఎంపీపీ, దుబ్బాక
ఇల్లు లేక ఇన్నాళ్లు దుర్భర జీవితం గడిపాం. ఇల్లు కట్టాలంటే జాగ కావాలి. లక్షల రూపాయలు కావాలి. మా పేదోళ్లకు అది సాధ్యం కాదు. సీఎం కేసీఆర్ సార్ దయతో మాకు డబుల్ బెడ్రూం వచ్చింది. ఎంపీ ప్రభాకర్‌రెడ్డి సార్ మాలాంటి వాళ్లను గుర్తించుకుని ఇండ్లు మంజూరు చేసినందుకు రుణపడి ఉంటాం. పేదల జీవితాల్లో వెలుగులు నింపిన సర్కారు కేవలం బీఆర్ఎస్ మాత్రమే. సీఎం కేసీఆర్‌ను బతికున్నంతా వరకు మరిచిపోం.
– కర్రోల్ల భూమయ్య, లబ్ధిదారుడు, పోతారం
దుబ్బాక మండలం పోతారం గ్రామంలో బుధవారం సాయంత్రం మెదక్ ఎంపీ, బీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్‌రెడ్డి పర్యటించారు. డబుల్ బెడ్రూం ఇండ్ల కాలనీ, మార్కెట్ గోదాం, వైకుంఠధామం, విద్యుత్ సబ్స్టేషన్లను పరిశీలించారు. ఈ నెల 30న దుబ్బాకలో బస్టాండ్‌తో పాటు పోతారం గ్రామంలో డబుల్ బెడ్రూం ఇండ్లు, విద్యుత్ సబ్‌స్టేషన్, గోదాం, పాఠశాల అదనపు తరగతి గదులు, రెడ్డి సంఘం భవన్, వైకుంఠధామాల ప్రారంభోత్సవం ఉన్నందున ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రొట్టె రాజమౌళి, కిషన్‌రెడ్డి, శ్రీనివాస్ తదితరులున్నారు.
గ్రామంలో మొదట 25 ఇండ్లు మంజూరయ్యాయి. ఎంపీ ప్రత్యేక కృషితో అదనంగా మరిన్ని ఇండ్లు మం జూరయ్యాయి. గ్రామంలో బీసీ కాలనీలో 35 ఇండ్లు, ఎస్సీ కాలనీలో 20ఇండ్లు, వడ్డెర కాలనీలో 18 డబు ల్ బెడ్రూం ఇండ్లు నిర్మించారు. గ్రామంలో రూ.6 కోట్లతో విద్యుత్ సబ్‌స్టేషన్, రెడ్డి సంఘం భవనం, గోదాం, పాఠశాలలో 4 అదనపు తరగతి గదుల నిర్మాణం జరిగింది. గ్రామ పంచాయతీ భవనానికి రూ.20 లక్షలు మంజూరు కావడం సంతోషంగా ఉంది. డబుల్ బెడ్రూం ఇండ్ల కాలనీలో విద్యుత్ సరఫరా, తాగునీటి నల్లా కనెక్షన్లు, అంతర్గత రహదారుల పక్కన మొక్కలు నాటి పచ్చదనంగా మారింది.
-గడిల జనార్దన్‌రెడ్డి, సర్పంచ్, పోతారం
ఇల్లు లేక అద్దె ఇంటిలో ఇబ్బందులు పడ్డాం. సీఎం కేసీఆర్ మా లాంటి పేదోళ్లకు డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టించి ఇవ్వడం సంతోషంగా ఉంది. సొంతింటి కలను తీర్చిన సీఎం కేసీఆర్ మాకు దేవుడయ్యాడు. కేసీఆర్ సార్ రూపంలో మాకు అదృష్టం కలిసోచ్చింది.
-యడారం రేఖ, లబ్ధిదారురాలు, పోతారం