జిల్లా కేంద్రంలో సోమవారం పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. పలు పోలింగ్ బూతుల్లో ఓటర్లు బారులుదీరారు. పోలింగ్ స్టేషన్లలో వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. కొన్ని కేంద్రాల్లో చల్లటి నీటితోపాటు మజ్జిగ అందజేశారు. వైద్యరోగ్య శాఖ ఆధ్వర్యంలో మందులు, ఏఎన్ఎమ్లు, ఆశవర్కర్లను అందుబాటులో ఉంచా రు. పలు పోలింగ్ కేంద్రాల్లో పలువురు యువతీ యువకులు తొలిసారి ఓటు హక్కును ఆనందోత్సవాలతో వినియోగించుకున్నారు. జాతీయ అర్చరీ క్రీడాకారిణి అనన్య పట్టణంలోని 160 పోలింగ్ కేంద్రంలో సోమవారం తొలిసారిగా ఓటు హక్కును వినియోగించుకున్నారు.

మెదక్, మే 13 (నమస్తే తెలంగాణ): మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో ఎన్నికల పోలింగ్‌కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడంతో పోలింగ్ సజావుగా ముగిసిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్‌రాజ్ తెలిపారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగిందన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు సాయంత్రం 6 గంటలలోపు పోలింగ్ స్టేషన్లలో క్యూలైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించినట్లు తెలిపారు.
ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం ఈవీఎంలను నర్సాపూర్ బీవీఆర్ఐటీ కాలేజీలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ సెంటర్‌కు తరలించి, అకడి స్ట్రాంగ్ రూములో భద్రపర్చనున్నామన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూం నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లుతో కలిసి ఆయన పరిశీలించారు. ఎన్నికలు నిర్వహణలో భాగంగా పోలింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించడంలో సహకరించిన అందరికీ అభినందించారు.

నర్సాపూర్, మే 13: నర్సాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా సోమవారం సాయంత్రం ఆరు గంటల వరకు 81.15 శాతం ఓట్లు నమోదయ్యాయని ఎన్నికల రిటర్నింగ్ అధికారి జగదీశ్వర్‌రెడ్డి తెలిపారు. ఉదయం నుంచి ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
నర్సాపూర్‌లోని పోలింగ్ కేంద్రంలో బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి ఓటింగ్ సరళిని పరిశీలించారు. ఆయనతో మున్సిపల్ చైర్మన్ అశోక్‌గౌడ్, వైస్ చైర్మన్ నయీమొద్దీన్, నాయకులు సింగాయిపల్లి గోపి, సత్యంగౌడ్, బాల్‌రెడ్డి, ఆంజనేయులుగౌడ్ ఉన్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని పోలింగ్ కేంద్రాన్ని ఐజీ రంగనాథ్ పరిశీలించారు. ఆయనతో అడిషనల్ ఎస్పీ మహేందర్, సీఐ జాన్‌రెడ్డి ఉన్నారు. చేగుంట మండలంలో 80.80 శాతం పోలింగ్ నమోదైంది. చేగుంట, నార్సింగి మండలాల్లో పోలింగ్ సరిళిని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, జడ్పీటీసీ ముదాం శ్రీనివాస్ పరిశీలించారు.

మెదక్ అర్బన్, మే 13: మెదక్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నర్సాపూర్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల కేంద్రంలో పోలింగ్ సరళిని మల్టీ జోన్-1 ఐజీ రంగనాథ్ పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి బందోబస్తు గురించి సూచనలు చేశారు. వారి వెంట మెదక్ అదనపు ఎస్పీ మహేందర్ ఉన్నారు. ఎన్నికల సందర్భంగా మెదక్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పోలింగ్ కేంద్రం, వెల్దుర్తిలో పోలింగ్ కేంద్రం, తూప్రాన్‌లోని వివిధ పోలింగ్ కేంద్రాలను ఎస్పీ బాలస్వామి సందర్శించి, పోలింగ్ సరళిని పరిశీలించారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద సిబ్బందికి సూచనలు చేశారు. తూప్రాన్‌లోని బాలుర, బాలికల జడ్పీహెచ్ పాఠశాలలను ఎస్పీ బాలస్వామి సందర్శించారు.